Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జక్కలొద్దిలో పేదలను ఖాళీ చేయించడానికి
- రంగంలోకి గూండాలు..
- పోలీసుల కొత్త కోణం..
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
గుడిసెవాసులను ఖాళీ చేయించడానికి వరంగల్ పోలీసు కమిషనరేట్ 'ఫ్రెండ్లీ పోలీసింగ్' మాటున గూండాలను రంగప్రవేశం చేయించారన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు వ్యూహాత్మకంగా తమ చేతికి మట్టి అంటకుండా గుడిసెలు వేసుకున్న పేదలను భయభ్రాంతులకు గురి చేసి స్థలాలు ఖాళీ చేయించే కుట్ర జక్కలొద్దిలో బహిర్గతమైంది. సీపీఐ(ఎం) నేతృత్వంలో వరంగల్, హన్మకొండ నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలాల్లో నెల రోజులుగా పేదలు గుడిసెలు వేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన సరిగ్గా రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు రాత్రి జక్కలొద్ది క్రాస్‌రోడ్డులో మామునూరు సీఐ వాహనాల తనిఖీ పేరిట జక్కలొద్ది గ్రామంలోకి నిరుపేదలు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదే క్రమంలో నిరుపేదలపై 20 మంది గూండాలు కర్రలు, సీసాలు, కత్తులతో దాడులు చేయడం గమనార్హం. పైపెచ్చు పోలీసు అధికారులు గుడిసెవాసుల మధ్య వాళ్లలో వాళ్లకే పడక కొట్టుకున్నారన్న మెలోడీ డ్రామాను సృష్టించడం గమనార్హం. తెర ముందు కనపడేది ఇదే. కాని ఈ డ్రామాను రక్తికట్టించిన వారిలో తెర వెనుక రాజకీయ ప్రజాప్రతినిధులు ఉన్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
గ్రేటర్ వరంగల్ నగరంలో సీపీఐ(ఎం) నేతృత్వంలో నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని పట్టాల కోసం నెల రోజులుగా పోరాటం చేస్తున్నారు. గతంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు నిర్బంధంతో గుడిసెలు పీకేయడం, గుడిసెలను తొక్కించి దహనం చేయడం, నిరుపేదలపై కేసులు పెట్టి జైలుకు పంపడం చేసేవారు. తాజాగా వరంగల్ పోలీసు కమిషనరేట్ అధికారులు కొత్త వ్యూహంతో గూండాలను రంగంలోకి దించి నిరుపేదలను భయ భ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాచేస్తే ప్రాణాలను కాపాడు కోవడానికి ప్రభుత్వ స్థలాలు వదిలి పారిపోతారని భావిం చారు. జక్కలొద్దిలో ఈనెల 2వ తేదీ రాత్రి పరిసర ప్రాంతం లోని పలువురు రౌడీలను పోగు చేసి పక్కా స్కెచ్‌తో గుడిసె వాసులపైకి పంపి ఉంటారని తెలుస్తోందని జరిగిన ఘటన పై విశ్లేషకులు తెలిపారు. ముందస్తుగా కరెంటు అధికారు లతో చెప్పి కరెంట్ తీయించడం, మామునూరు సీఐ స్వయం గా రంగంలోకి దిగి ఉదయాన్నే పనికి వెళ్లి జక్కలొద్దికి వస్తు న్న నిరుపేదలను మార్గమధ్యంలోనే అడ్డగించి గుడిసెలు వేసిన ప్రాంతానికి ఎవరూ రాకుండా అడ్డుకోవడం అందులో భాగమేనని సీపీఐ(ఎం) నేతలు ఆరోపించారు.
కత్తులతో స్వైరవిహారం..
గుడిసెవాసుల వద్దకు వెళ్లిన 20 మంది యువకులు కత్తులు, కర్రలు, బీరు సీసాలు చేత పట్టుకొని బూతులు మాట్లాడుతూ వారిని రెచ్చకొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అంచనా వేసిన మహిళలు 'మేమంతా నిరుపేదలం.. ఇక్కడ గొడవ చేయొద్దని, దండం పెడుతాం వెళ్లిపోండన్నా ..' అంటూ ప్రాధేయపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది రౌడీమూకలు పానీపూరీ బండి వద్దకు వచ్చి వాటిని తిని బాగా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ బండిపై దాడిచేశారు. బండిని పడేసి, గ్యాస్ కనెక్షన్ తీసేశారు. పక్కన మహిళలుంటే వారిని అసభ్యంగా దూషిస్తూ చీరెలు లాగే ప్రయత్నం చేశారు. పానీపూరీ బండి వ్యాపారిని రక్షించి గుడిసెవాసులు రౌడీలపై ఎదురుతిరిగారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన సీపీఐ(ఎం) కార్యకర్త రమేశ్‌పై రౌడీమూకలు కర్రలతో దాడి చేశారు. రమేశ్‌ను రక్షించడానికి వెళ్లిన మాధవి అనే మహిళను కడుపులో తన్నడంతో అక్కడే పడిపోయింది. రమేశ్ తలపై బీరు సీసాతో దాడి చేయగా, తల పగిలింది. గర్బిణీ మహిళ అని కూడా చూడకుండా ఆమెపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడింది. దాడులకు పాల్పడుతున్న యువకులను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఓ వృద్ధురాలని కొట్టడంతో ఆమె చేయి విరిగింది. ఇలా గుడిసెవాసులను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించడంతో అక్కడి యువత ధైర్యంతో ముందుకు వెళ్లి నిరుపేదలను ఏకం చేయడంతో రౌడీలు వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడ్డ రమేశ్‌ను ఆస్పత్రికి తరలించారు.
సీఐపై ఆరోపణలు
మామునూరు సీఐ ప్రవర్తించిన తీరుపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుడిసెవాసులపై రౌడీలు దాడులు చేస్తున్న సందర్భంలో సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్. రంగయ్య సీఐకి ఫోన్ చేశారు. జరుగుతున్న దాడి గురించి మాట్లాడితే సీఐ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. జక్కలొద్ది క్రాస్‌రోడ్డులో ఉండి పేదలను గ్రామంలోకి వెళ్లనీయకుండా అడ్డుకొని మరీ రౌడీలతో దాడి చేయించడం సరికాదనడంతో, 'నేను వెహికిల్ చెకింగ్'లో ఉన్నానని, ఫోన్లో కాదు.. రేపు వచ్చి మాట్లాడు అంటూ సీఐ ఫోన్ కట్ చేసిన విషయాన్ని రంగయ్య 'నవతెలంగాణ'కు తెలిపారు. మళ్లీ మళ్లీ ఫోన్ చేసినా సీఐ ఫోన్ లిప్ట్ చేయకపోవడం గమనార్హం.
దాడితో మరింత ఐక్యత
నిరుపేదలపై రౌడీలు దాడి చేయడం, పోలీసు అధికా రులే వెనుకుండి చేయించారని స్పష్టత వచ్చిన జక్కలొద్ది గుడిసెవాసుల్లో మరింత ఐక్యత వెల్లివిరుస్తుంది. శుక్రవారం జక్కలొద్దికి వచ్చిన సీపీఐ(ఎం) ప్రతినిధి బృందానికి దాడి జరి గిన విధానాన్ని వివరించిన నిరుపేదలు ఎటువంటి సవాళ్ల యినా ఎదుర్కొంటామని, ప్రాణాలు పోయినా పోరాటం ఆపమని హామీ ఇవ్వడం నాయకత్వాన్ని ఆకట్టుకుంది. ధైర్యంగా, ఐక్యంగా పోరాడితే ఇండ్ల స్థలాలు దక్కించుకోవడంలో విజయం సాధించడం ఖాయమని ప్రతినిధి బృందం గుడిసెవాసులకు దిశానిర్దేశం చేసింది.