Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష
- తప్పని రుజువైతే రాజీనామా చేస్తా
- నిజమైతే ముక్కు నేలకు రాస్తారా
- పాదయాత్రతో వంచనకు శ్రీకారం
- బీజేపీ, కాంగ్రెస్‌కు తగిన మూల్యం తప్పదు: ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి / కోస్గి
కేంద్రంలోని బీజేపీ శవ రాజకీయాలాడుతోందని, నిధుల కేటాయింపులో వివక్ష చూపుతూ రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోందని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం, మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి పర్యటించారు. కోస్గిలో రూ.119 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్, కూరగాయల మార్కెట్, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌ను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. అన ంతరం ఎమెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రం నుంచి 3,68,798 కోట్లు పన్నుల రూపంలో చెల్లిస్తే.. రాష్ట్రానికి వచ్చింది లక్షా 28 వేల కోట్లు మాత్రమేనన్నారు. ఈ లెక్కలు తప్పని తేలితే మంత్రిగా రాజీనామా చేయడానికి తాను సిద్ధమన్నారు. అవి అవాస్తవాలని నిరూపిస్తే కేంద్ర మంత్రి అమిత్‌షా పాలమూరు గడ్డమీద ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలోని సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టి ఎన్నికల శంఖారావం పూరించిన బండి సంజరు.. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇప్పించడంలో ఎందుకు విఫలమయ్యారని విమర్శించారు. కర్నాటకలో తుంగభద్ర నదిపై నిర్మించే అప్పర్ భద్రతకు జాతీయ హోదా ఇస్తూ పాలమూరు-రంగారెడ్డిని ఎందుకు విస్మరించారని నిలదీశారు.
అమెజాన్, గూగుల్ వంటి సంస్థలు రెండో అతి పెద్ద కంపెనీగా తెలంగాణ రావడానికి ఉత్సాహం చూపడం గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు వలసల జిల్లాగా పేరున్న ఈ ప్రాంతం నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్న పరిస్థితులు సంతోషాన్ని కల్గిస్తున్నాయన్నారు. కృష్ణా బేసిన్లో 811 టీఎంసీల్లో తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉందని, ఈ విషయమై కృష్ణా ట్రిబ్యునల్‌కు ఎందుకు సిఫారసు చేయడం లేదని ప్రశ్నించారు. వెనుకబడిన ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు తాగు, సాగునీరు అందించే విషయంలో తాము చిత్తశుద్ధితో పని చేస్తుంటే.. కేసుల పేరుతో ప్రాజెక్టులను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నారాయణపేట-కృష్ణ, గద్వాల-మాచర్ల రైలు మార్గాల పనులు ప్రారంభించాలన్నారు.
దేవరకద్ర మండలంలోని వెంకయ్యపల్లి గ్రామంలో రూ.18 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జి, అడ్డాకుల మండలంలోని పేరూరు వద్ద ఎత్తి పోతల, గుడిబండ వద్ద రోడ్డు, భూత్పూరు మండల కేంద్రంలో మినీ స్టేడియం పనులను మంత్రి ప్రారంభించారు. వీటితో పాటు ఇంటర్నల్ రోడ్లను రూ.10 కోట్లతో, వెజ్ మార్కెట్ రూ.2 కోట్లతో పనులు ప్రారంభించారు. భూత్పూరు మండలం అమిస్తాపూర్‌లో 285 రెండు పడకల గదులను లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహం, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, సురభి వాణిదేవి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ నిజాం పాషా, మాజీ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శివకుమార్, మాజీ ఎంపీ మంద జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.