Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఆర్ఎల్డీసీ సమావేశంలో విద్యుత్ సంస్థల ధీమా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రస్తుత విద్యుత్ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొగలమని దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ) సమావేశం ధీమా వ్యక్తం చేసింది. రీజియన్ పరిధిలో పీక్ డిమాండ్ 60,876 మెగావాట్లకు చేరిందనీ, అయినా గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. 42వ సదరన్ రీజియన్ పవర్ కమిటీ సమావేశం శనివారం కమిటీ చైర్మెన్ దేవులపల్లి ప్రభాకరరావు అధ్యక్షతన బెంగుళూరులో జరిగింది. సభ్య కార్యదర్శి అసిత్ సింగ్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల డైరెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి టీఎస్ ట్రాన్స్‌కో డైరెక్టర్లు టీ జగత్‌రెడ్డి, బీ నర్సింగరావు, జెన్కో నుంచి బీ లక్ష్మయ్య, సీఈ పీ రత్నాకరరావు, ఎస్ఈలు పి సురేష్‌బాబు, ఈగ హనుమాన్, ఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో చేపట్టిన, అమలు చేస్తున్న విద్యుత్ సంస్కరణలను వివరించాయి. అత్యధికంగా తమిళనాడు రాష్ట్రం 17,563 మెగావాట్ల నమోదు చేసిందని తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరిగినట్టు వివరించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ పరస్పర అవగాహన, చొరవతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా కమిటీ చైర్మెన్ దేవులపల్లి ప్రభాకరరావు ఆకాంక్షించారు.