Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షించిన సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి సంస్థ రానున్న ఐదేండ్లలో పది కొత్త ప్రాజెక్టుల నుంచి బొగ్గు ఉత్పత్తి ని ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ డైరెక్టర్లు, అడ్వయిజర్లతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒడిశా లోని నైనీ కోల్ బ్లాక్ నుంచి ఈ ఏడాది 25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాలనీ, కొత్తగూడెం వద్ద ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వీకే కోల్ మైన్ నుంచి 15 లక్షల టన్నుల బొగ్గు, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీ నుంచి 5 లక్షల టన్నులు ఉత్పత్తి చేపట్టాలని నిర్ణయించారు. అలాగే ఇల్లందు ఏరియాలోని జేకే ఓసీ గని నుంచి 10 లక్షల టన్నుల బొగ్గుతో పాటు మొత్తం 10 ప్రాజెక్టులకు కలిపి 332 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల సంస్థ మరో రూ.50 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో డైరెక్టర్లు ఎస్. చంద్ర శేఖర్ (ఆపరేషన్స్), ఎన్.బలరామ్ (పి అండ్ పి, ఫైనాన్స్, పర్సనల్), డి.సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), అడ్వైజర్లు డి.ఎన్.ప్రసాద్ (మైనింగ్), సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె.అల్విన్ తదితరులు పాల్గొన్నారు.