Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. 2014లో రూ.23 వేల కోట్లుగా ఉన్న ఈ ఆదాయం.. ఇప్పుడు రూ.65 వేల కోట్లకు చేరిందని ఆయన వివరించారు. రాష్ట్రానికి విచ్చేసిన ఉత్తరప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు శనివారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో సీఎస్‌తో సమావేశమయ్యారు. వ్యవస్థీకృత మార్పుల ద్వారా వాణిజ్య పన్నుల శాఖ పనితీరులో గణనీయమైన మార్పులొచ్చాయని ఈ సందర్భంగా సీఎస్ వారికి వివరించారు. మాన్యువల్ ఆధారిత నోటీసులు, ప్రొసీడింగ్‌లను పూర్తిగా తొలగించామని తెలిపారు. ప్రతీస్థాయిలో భౌతిక లక్ష్యాల స్థానంలో నిర్దారిత ఆధారిత లక్ష్యాలను ఏర్పాటు చేశామని వివరించారు. కొత్తగా అనేక సర్కిళ్లను ఏర్పాటు చేయటం ద్వారా వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించామని అన్నారు. శాఖాపరమైన పరిశోధనలు, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేశామని వివరించారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఇలాంటి విధానాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ఉత్తర ప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఎస్.మినిస్టి ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమినషనర్ నీతూ ప్రసాద్, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అదనపు కమిషనర్లు సాయి కిశోర్, కాశి, శోభన్‌బాబు పాల్గొన్నారు.