Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కఠినంగా శిక్షించాలని నగరవ్యాప్తంగా నిరసనలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆమ్నేషియా పబ్ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నడిరోడ్డుపై కారులో ఐదుగురు నిందితులు బాలికపై సామూహిక లైంగిక దాడి రాష్ట్రంలో కలకలం రేపింది. ఇప్పటికే ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్, బేకరీతోపాటు సమీపంలోని సీసీ కెమెరాలు, సీడీఆర్‌ను పరిశీలించిన పోలీసులు వాహనంలో లైంగిక దాడికి సంబంధించిన ఆధారాలను సేకరించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం ఒక నిందితుడిని అరెస్టు చేయగా, శనివారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వారిలో ఒక మేజర్, ఇద్దరు మైనర్లు ఉన్నారు. సాజిద్ మాలిక్(18), వక్ఫ్ బోర్డు చైర్మెన్ కొడుకు(16), మరో మైనర్ (16)ను అరెస్టు చేసినట్టు పోలీసులు ధృవీకరించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. అనంతరం ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకి తరలించారు. మరోవైపు పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారిని కర్నాటకలో ఆదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్టు తెలిసింది. వీరిలో ఉమర్ఖాన్తోపాటు మరో మైనర్ కూడా ఉన్నట్టు సమాచారం. వారిని ఆదివారం లేదా సోమవారం మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ ఘటనపై నగరవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అయితే, బాలికపై లైంగికదాడికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు శనివారం బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్రావు మీడియాకు విడుదల చేయడం ఆయనకు ఆ వీడియోలు ఎలా లభించాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
విచారణ చేపట్టిన ఆబ్కారీ శాఖ
జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనపై ఎక్సైజ్ శాఖా ఆరా తీస్తోంది. మైనర్లను పబ్‌లోకి అనుమతిం చకూడదని నిబంధనలున్నా ఎలా అనుమతించారన్న ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలించడంతోపాటు పబ్ యాజమా న్యం నుంచి వివరాలు రాబట్టారు. ఓ కార్పొరేట్ స్కూల్ పేరుతో ఉస్మాన్ అనే విద్యార్థి ఫేర్వెల్ పార్టీకి అనుమతి తీసుకున్నట్టు నిర్వాహకులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారని తెలిసింది. 150 మంది విద్యా ర్థుల కోసం పబ్బుక్ చేశారని, పార్టీ కోసం పబ్‌కు రూ.2లక్షలు చెల్లించారని, దాంతో భవనంలోని నాలుగో అంతస్తులో అనుమతినిచ్చినట్టు అధికారులు గుర్తించారు. అయితే పార్టీలో మద్యం సరఫరా చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.