Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాడు ఇందిరకు...నేడు సోనియాకు దేశ ప్రజల అండ : సీఎల్పీ నేత భట్టి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశం కోసం ఇందిరాగాంధీ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు.అలాంటి మహోన్నత కుటుంబంలోని వ్యక్తులు ఈడీ, ఐటీ సంస్థలతో బీజేపీ ప్రభుత్వం ఆ కుటుంబంపై దాడులు చేయిస్తే భయపడతారా? అని ప్రశ్నించారు. ఎన్నో క్లిష్ట సమయాల్లో ఆ కుటుంబానికి ప్రజలు అండగా నిలిచారని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ప్రతిపక్షాలను గౌరవిస్తేనే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు అవుతుందని ఆ పార్టీకి హితవు పలికారు.
మైనర్లకు ఎలా అనుమతి ఇచ్చారు..?
రాష్ట్ర రాజధానిలో జరిగిన బాలిక అత్యాచారం ఘటనలో పోలీసుల విచారణ నిష్పక్షపాతంగా లేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. అందువల్ల ప్రభుత్వం సీబీఐ విచారణకు అనుమతించాలని డిమాండ్ చేశారు. పబ్, డ్రగ్ కల్చర్‌ను నియంత్రించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. హోంమంత్రి, డీజీపీని కలిసేందుకు వెళ్లిన మహిళ కాంగ్రెస్ నేతలను అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.