Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగికదాడి ఘటనలో నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలి
- నిబంధనలు పాటించని పబ్‌లను రద్దు చేయాలి: సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటన అత్యంత దారుణమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలనీ, నిందితులు ఏ స్థాయివారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అసాంఘిక కార్యక్రమాలకు నెలవైన పబ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, నిబంధనలు పాటించని వాటిని రద్దు చేయాలని పోలీస్‌శాఖను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతనెల 28న స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ వద్ద 16 ఏండ్ల బాలికను ఎనిమిది మంది యువకులు కారులో తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనలో రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వారి పిల్లలు ఉన్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు. రెండు రోజుల వరకూ అమ్మాయి తరఫున ఫిర్యాదు ఇవ్వలేదంటే ఆమెపై ఎంత ఒత్తిడి ఉందో, ఈ ఘటన వెనక ఏ స్థాయివారు ఉన్నారో అర్థమవుతున్నదని వివరించారు. రాష్ట్రంలో రోజురోజుకీ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. విశ్వనగరమైన హైదరాబాద్‌లో బాలికలు, మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విష సంస్కృతికి, అసాంఘిక కార్యకలాపాలకు పబ్‌లు నెలవుగా మారుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం, పోలీసులు ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్పితే, నివారించడానికి తీసుకున్న చర్యలెక్కడా?అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలనీ, ఈ లైంగికదాడి ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలనినీ, మహిళలకు, బాలికలకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.