Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు, ఆంగ్ల మాధ్యమం కలిపి ముద్రణ
- పిల్లలకు అర్థమయ్యేలా ద్విభాషలో పాఠ్యాంశాలు
- జిల్లా కేంద్రాలకు చేరిన 20 లక్షలు పుస్తకాలు
- ఈనెలాఖరు నాటికి 70 శాతం పంపిణీ
- మిగతావి సెప్టెంబర్‌లో విద్యార్థులకు అందజేత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు పాఠ్యపుస్తకాల ముద్రణ వేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 20 లక్షల పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరాయి. మిగతా పుస్తకాలు ఈనెలాఖరు వరకు 70 శాతం అంటే 1.20 కోట్ల పుస్తకాలు పాఠశాలలకు చేరతాయి. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈనెల 13వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవుతున్నాయి. అప్పటి వరకు పాఠశాలలకు పుస్తకాలను చేర్చేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2022-23 విద్యాసంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు సర్కారు బడుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నది. దీంతో పాఠ్యపుస్తకాలు తెలుగు, ఆంగ్ల మాధ్యమం (ద్విభాష)లో ముద్రించారు. అంటే ఒకే పుస్తకంలో రెండు భాషలకు చెందిన పాఠ్యాంశాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థుల సౌకర్యార్థం తెలుగులో చదువుకుని ఇంగ్లీష్‌లో ఉన్న పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్ల పుస్తకాల ముద్రణలోనూ మార్పులొచ్చాయి. రెండు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) వారీగా పుస్తకాలను ముద్రించారు. అంటే ఎస్ఏ-1కు పార్ట్-1 పుస్తకం, ఎస్ఏ-2కు పార్ట్-2 పుస్తకాలను రూపొందించారు. అంటే విద్యార్థులకు ఇప్పటి వరకు ఒక సబ్జెక్టుకు ఒకే పుస్తకం ఉండేది. ఇకనుంచి ఒక సబ్జెక్టుకు రెండు పుస్తకాలను ముద్రిస్తున్నారు. అందుకే ఈ నెలాఖరునాటికి 1.67 కోట్ల పార్ట్-1 పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేస్తారు. మిగిలిన 43 లక్షల పార్ట్-2 పుస్తకాలు సెప్టెంబర్ 15 నాటికి విద్యార్థులకు అందజేస్తారు. ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకోవైపు ఉచిత పాఠ్యపుస్తకాల మీద సీరియల్ నెంబర్ (యూనిక్ కోడ్)ను ముద్రిస్తున్నారు. దీనివల్ల ప్రతి ఉచిత పాఠ్యపుస్తకం ఏ విద్యార్థికి ఇస్తున్నారో వివరాలు అందుబాటులో ఉంటాయి. ఒక్క పుస్తకమూ దుర్వినియోగం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అధికారుల తీరుతో ఆలస్యం
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు కలిపి సుమారు 40,898 వరకు ఉన్నాయి. వాటిలో 60 లక్షల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో కలిపి 26 లక్షల వరకు ఉన్నారు. వారి కోసం 2.10 కోట్ల పుస్తకాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. అందుకనుగుణంగా ఏప్రిల్‌లోనే టెండర్లను ఆహ్వానించారు. ఎక్కువ ధర కోడ్ చేయడంతో రెండోసారి టెండర్లను పిలవాల్సి వచ్చింది. దీంతో ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రక్రియ మేలో ప్రారంభమైంది. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల అలసత్వం కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది. తమిళనాడు, పంజాబ్, చండీఘర్ నుంచి పేపర్ రావడమూ ఆలస్యానికి మరో కారణంగా ఉన్నది. త్వరగా టెండర్లను ఖరారు చేసి పాఠ్యపుస్తకాల ముద్రణను ప్రారంభించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పుస్తకాల ముద్రణ పూర్తయ్యేది. విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండేవి. కానీ ఈ ఏడాది ఆలస్యం కావడం గమనార్హం. ఇంకోవైపు పాఠశాల విద్యాశాఖ అధికారుల తీరు వల్ల ఇప్పటి వరకు ప్రయివేటు పాఠశాలల్లో అమ్మకానికి సంబంధించిన పాఠ్యపుస్తకాల ముద్రణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇంకా ఖరారు కాలేదు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తర్వాత ప్రయివేటు ప్రింటర్లకు అనుమతులు వస్తాయి. అప్పుడు ముద్రణ ప్రారంభమవుతుంది. వాస్తవానికి ఇప్పటికే మార్కెట్లో ప్రయివేటు పాఠశాలలకు చెందిన పుస్తకాలు అందుబాటులో ఉండాలి. ఇంకా ముద్రణ ప్రారంభం కాకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది. వచ్చే విద్యాసంవత్సరానికి 1.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అమ్మకం కోసం అవసరమని అధికారులు అంచనా వేశారు.