Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త కులాలకు కష్టాలు
- కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం
- ఉద్యోగ, పాఠశాల విద్యలో అప్డేట్ కాని కులాలు
- రెండేండ్లు కావస్తున్నా సంక్షేమం కరువు..
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన 17 సంచార, ఇతర కులాలకు ప్రభుత్వ కార్యాలయాల్లో గుర్తింపు దక్కడం లేదు. కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుంటే స్వీకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీఓ రాలేదంటూ రెవెన్యూ, ఇతర కార్యాలయాల్లో దాటవేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి 20 నెలలు కావస్తున్నా నేటికీ.. జీఓ జారీకాకపోవడం గమనార్హం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గుర్తింపునకు నోచుకోక సంక్షేమ ఫలాలకు దూరంగా ఉన్న ఈ కులాలు.. మళ్లీ ఓసారి వెనుకబాటుకు గురవుతున్నాయి. సమస్య పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అట్టడుగు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించాలన్న ఉద్దేశంతో 2020 సెప్టెంబర్ 9న గుర్తింపు లేని 17 కులాలను క్యాబినెట్ ఆమోదం ద్వారా జీఓ నెంబర్ 3తో అధికారికంగా గుర్తించింది. ఇందులో 13 సంచార కులాలు ఓడ్, అద్దపు వారు, బాగోతుల, బైలు కమ్మర, ఏనూటీ, గంజి కూటి వారు, కాకి పడగల, పటం వారు, సన్నాయిల, శ్రీ క్షత్రియ రామజోగి, తెర చీరాల, తోలుబొమ్మలాట వారిని బీసీ-ఏ జాబితాలో అలాగే గౌళీ, అహిర్ యాదవ్, కుల్ల కడిగి, సారోళ్ళు కులాలను బీసీ-డీ, ఈ జాబితాలో చేర్చింది. అయితే, ఈ కులాలకు చెందిన విద్యార్థులు కులం సర్టిఫికేట్ కోసం లేదా ఇతర గుర్తింపు పత్రాల కోసం కార్యాలయా లను సందర్శిస్తే పత్రాలు జారీ కావడం లేదు. జీఓ రాలేదని అధికారులు చెబుతు న్నారు. పాఠశాల విద్యతో పాటు ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్, ప్రభుత్వ సంస్థలైన ట్రాన్స్‌కో, సింగరేణిలో ఉద్యోగ నోటిఫికేషన్లలో జాబ్‌ల కోసం దరఖాస్తు చేసుకుం దామంటే కొత్త కులాల సమాచారం అప్డేడ్ కాలేదు. దీంతో విద్యార్థులు ఆయో మయంలో పడుతున్నారు. ఇటీవల విడుదలైన ట్రాన్స్‌కో నోటిఫికేషన్ దరఖాస్తు తేదీ ఈనెల 8వ తేదీ ముగియ నుండటంతో అర్హులైన నిరు ద్యోగులు ఆందోళన చెందుతు న్నారు. సంబంధిత యంత్రాంగం స్పందించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరు తున్నారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇలాకాలో..
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నియోజక వర్గం కరీం నగర్‌లోని భగత్‌నగర్‌కు చెందిన ఓడ్ కులానికి చెందిన విద్యార్థిని మోతే నందిని కుల సర్టిఫికేట్ కోసం రెండు నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నది. మేయర్ సునీల్ రావు సిఫారసు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కులాలకు గుర్తింపు ఇచ్చి రెండేండ్లు కావస్తున్నా రాష్ట్ర బడ్జెట్లో కేవలం ఒక్క రూపాయి కూడా ఈ కులాలకు కేటాయించలేదు. ప్రభుత్వం కుల గుర్తింపు ఇవ్వడంతో అభి వృద్ధిపై కొండంత ఆశలు పెట్టుకున్న సంచార కులాలు దయనీయ పరిస్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు.
జీఓ రాలేదని దరఖాస్తును తిరస్కరించారు
ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కావడంతో కుల ధ్రువీకరణ పత్రం కోసం ఆర్మూర్ తహసీల్దార్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేశాను. పదిహేను రోజుల తర్వాత దరఖాస్తు తిరస్కరించారు. రెవెన్యూ అధికారికి కారణం అడగగా తమకు ఎలాంటి జీవో రాలేదని అందుకోసమే తిరస్కరించినట్టు తెలిపారు. దీంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోవాల్సి వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. కలెక్టర్ సార్ వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలి.
- జాదవ్ రాజు, నిజామాబాద్
(గోవింద్‌పేట్, ఆర్మూర్ మండలం)
ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కుతున్నారు
ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కావడంతో 17 కులాలు రిజర్వేషన్ల జాబితాలో అప్డేట్ కాకపోవడంతో రిజర్వేషన్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయమై ఎస్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్ఆర్డీలకు లెటర్, మెయిల్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. కాబట్టి వెంటనే అప్డేట్ చేసి ఈ ఉద్యోగాలకు గడువు పెంచాలి. లేకపోతే కోర్టును ఆశ్రయిస్తాం.
- కొంగల రాంప్రసాద్
(17 కులాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)