Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
- రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలి :
- వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-నస్రుల్లాబాద్
రాష్ట్ర అవసరాలకు 30 లక్షల మెట్రిక్ టన్నుల వరి అవసరం అయితే రాష్ట్రంలో ఏడాదికి 3 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. అయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని, ఒక్కసారి నాటితే 30 ఏండ్ల వరకు దిగుబడులు వస్తాయని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లిలోని వితత్తనాభివృద్ధి క్షేత్రంలో రూ.4.85 కోట్లతో నూతనంగా నిర్మించిన విత్తనశుద్ధి కర్మాగారం, గిడ్డంగుల సముదాయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి అయన శనివారం ప్రారంభించారు. ముందుగా బొప్పాస్పల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పెంచుతున్న ఆయిల్ పామ్ క్షేత్రాన్ని సందర్శించిన ప్రముఖులు అక్కడే ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. అనంతరం రైతు అవగాహన సదస్సులో మాట్లాడారు. మన దేశం ఏటా లక్ష కోట్ల రూపాయల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నదని తెలిపారు. అందుకే రైతులు డిమాండ్ ఉన్న పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుకూల వాతావరణం, నేలలు ఉన్నట్టు తెలిపారు. రూ.300ల మొక్కను ప్రభుత్వ సబ్సిడీతో రూ.20కే అందజేస్తున్నట్టు తెలిపారు.
ఎకరా వరి నీటితో 5 ఎకరాల ఆయిల్ పామ్ సాగుచేయవచ్చని తెలిపారు. కొనుగోలు సమస్య లేదని, కంపెనీ వాళ్లే నేరుగా వచ్చి కొనుగోలు చేస్తారని తెలిపారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గం ప్రధానంగా వరి పండించే ప్రాంతమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే సీఎం కేసీఆర్ ముందుకొచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నా సరియైన ఆదాయం రావడం లేదన్నారు. దీనికితోడు కోతులు, అడవి పందులు, పర్యావరణ ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. కావున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. 2018లో ప్రయో గాత్మకంగా బొప్పస్‌పల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ మొక్కలను నాటించామని, వాటికి గెలలు వచ్చినట్టు తెలిపారు. అంతర పంటలు సైతం సాగుచేసుకోవచ్చని వెల్లడించారు.
కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఉద్యానశాఖ డైరెక్టర్ యల్. వెంకట్రామిరెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ బి. శ్రీవివాస్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, రైతుబంధు జిల్లా అధ్యక్షులు డి అంజిరెడ్డి, బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, నియోజకవర్గ ప్రజాప్రతినిధుల, వ్యవసాయ, ఉధ్యాన, విత్తనాభివృద్ధి శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.