Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనురాగ్ సింపోజియంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆటోమేషన్, కోవిడ్-19 వల్ల ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఉన్నత విద్యారంగం కొత్త డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా మారాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్లోని అనురాగ్ విశ్వవిద్యాలయంలో 'పరిశ్రమ-సన్నద్ధమైన నైపుణ్యాలు'అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్సెరా ప్రాంతీయ డైరెక్టర్ పుష్కర్ కేల్కర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక స్వీకరణ వేగాన్ని వేగవంతం చేసిందని చెప్పారు. 'కోర్సెరా ఫర్ క్యాంపస్' ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల విద్యాసంస్థలతో విస్తరించిందనీ, భారతదేశంలోనే 10 కోట్ల మంది విద్యార్థులతో అనుసంధానించబడిందని అన్నారు. పరిశ్రమలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తమ పాఠ్యాంశాలను రూపొందించడానికి ఉన్నత విద్యా సంస్థలు నైపుణ్యాలు-మొదటి విధానంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అపారమైన అవకాశాలతో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆన్లైన్ అభ్యాసం సహాయపడుతుందన్నారు. అనురాగ్ విశ్వవిద్యాలయం మేనేజింగ్ ట్రస్టీ నీలిమ మాట్లాడుతూ రికార్డు స్థాయిలో 2,100 మంది ఉద్యోగ నియామకాలను తమ విద్యార్థులు సాధించారని వివరించారు. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆఫ్లైన్, ఆన్లైన్ బోధనా విధానంతో మిళితమైన అభ్యాసం ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూఈ హబ్ సీఈఓ దీప్తి రావుల, గీతం బ్లెండెడ్ లెర్నింగ్ డైరెక్టర్ రీమా గుప్తా, అనురాగ్ విశ్వవిద్యాలయం వీసీ ఎస్ రామచంద్రం, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ జి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.