Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సీపీఐ(ఎం)నిరసన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో/సిటీబ్యూరో
కారులో బాలికపై సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితులు ఎంతటి వారైనా నిస్పక్షపాతంగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం వాటిని అరికట్టడంలో విఫలం అవుతున్నాయని చెప్పారు. సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యురాలు కె.నాగలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడుల ఘటనల్లో ఎక్కువ శాతం ప్రజాప్రతినిధుల కుమారులు, వారి అనుచరులు ఉంటున్నారని తెలిపారు. వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.దశరథ్, ఎం. శ్రీనివాసరావు, ఎం.మహేందర్, నాయకులు జి.నరేష్, ఎన్.మారన్న, జె.కుమారస్వామి, ఆర్.వాణి, ఆర్.అశోక్, ఎ.పద్మ, జి.కిరణ్, జి.రాములు, ఎ.శ్రీరాములు, ఎ.ఎ.కె. పాష, పి.విమల, లక్ష్మి, షబానా తదితరులు పాల్గొన్నారు.
ఎస్వీకే వద్ద ఐద్వా నిరసన
జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో లక్ష్మి మాట్లాడుతూ నిజమైన దోషులను తక్షణం అరెస్టు చేయాలనీ, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వార కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐద్వా బృందం రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బి హైమావతి, కేఎన్ ఆశాలత, సహాయ కార్యదర్శులు ఎం వినోద, సమీనా అప్రోజ్, పాలడుగు ప్రభావతి, మాచర్ల భారతి, నాగలక్ష్మి, పి శశికళ, ఇ ఆహాల్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయం ముట్టడి
రాష్ట్రంలో మహిళాలకు రక్షణ లేదని కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షులు సునీతారావు ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన ఘటనను నిరసిస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని యువజన కాంగ్రెస్ హైదరాబాద్ నగర అధ్యక్షుడు మోత రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్, హోంమంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సమగ్ర విచారణ జరపాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
లైంగిక దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపిచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. డేగ కళ్లతో పోలీసు టవర్, సీసీ కెమెరాలున్న ఆ ప్రాంతంలోనే బాలికను కిడ్నాప్ చేసి, సామూహికంగా లైంగికదాడికి పాల్పడ్డారంటే నిందితులు ఎంత కరుడుగట్టిన వాళ్లో అర్థమవుతున్నదని విమర్శించారు. అసాంఘిక, విషసంస్కృతికి నిలయాలైన పబ్‌లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ఎలాంటి ఒత్తిడీ లేదు: హోంమంత్రి
జూబ్లీహిల్స్ సామూహిక లైంగిక దాడి ఘటనపై హోమంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఈ సంఘటన బాధాకరం అన్నారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. స్వతంత్రంగా దర్యాప్తు జరుగుతోందన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి : టీడీపీ
బాలికపై జరిగిన లైంగిక దాడిని తెలుగుమహిళా సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు సీహెచ్ విజయశ్రీ తీవ్రంగా ఖండించారు. టీడీపీ హైదరాబాద్ నగర కార్యాలయంలో ఆమె మాట్లాడారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సీబీఐకి అప్పగించాలి: బీజేపీ
లైంగికదాడి కేసును సీబీఐకి అప్పగించాలని భాజపా నేతలు డీజీపీని కోరారు. ఈ కేసులో నిందితులుగా పెద్ద వాళ్ల కుమారులున్నందునే దర్యాప్తులో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయటంలో నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పాత్ర లాంటి అంశాలపై తమకున్న అనుమానాలను డీజీపీకి వివరించారు. నిందితులు తప్పించుకోకుండా కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు రాంచందర్ రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బంగారు శృతి కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి : డీవైఎఫ్ఐ
లైంగిక దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్ డిమాండ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తున్న పబ్బులను మూసేయాలనీ, పోలీసులు వాటిని నిరంతరం తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పబ్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి : ఎస్ఎఫ్ఐ
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, అమ్మాయిలపై రోజురోజుకు లైంగికదాడుల ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.