Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13,14వ తేదీల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు :
- కౌలు రైతుల రాష్ట్ర సదస్సులో పోతినేని, సాగర్
నవతెలంగాణ-మిర్యాలగూడ
భూసారాన్ని బట్టి కౌలు రేటును నిర్ణయించాలని, కౌలు రైతుల చట్టం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, సాగర్ ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఏఆర్సీ ఫంక్షన్హాల్లో ఆదివారం కౌలురైతుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2011 చట్టం ప్రకారం కౌలురైతులకు ప్రతి ఏడాదీ రుణ అర్హత కార్డులివ్వాలని చెప్పారు. దాని ఆధారంగా బ్యాంకురుణాలు, రైతుబీమా, ప్రకృతి వైపరీత్యాల పరిహారం, పంటల బీమా, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది కౌలు రైతులున్నట్టు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ అంచనా వేసిందని తెలిపారు. సాగవుతున్న వ్యవసాయంలో 30 శాతం మంది కౌలురైతులు ఉన్నారని చెప్పారు. ఏడాది కాలంలో 640 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. అందులో 40 శాతం మందికౌలు రైతులే ఉన్నారని తెలిపారు. వారందరికీ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా స్కేల్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు సమానంగా సంక్షేమపథకాలు అమలు చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. రైతుబంధు పథకం అమలు చేయాలని కోరారు. కౌలు రైతుల హక్కుల సాధన కోసం ఈ నెల 13, 14వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో తహసీిల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అరిబండి ప్రసాద్‌రావు, కౌలు రైతు రాష్ట్ర కన్వీనర్ తాత భాస్కరరావు, మహిళా రైతు రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాటిలేని రమేష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు లెల్లెల బాలకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి శెట్టివెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, బుర్రి శ్రీరాములు పాల్గొన్నారు.