Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీ మెడికల్ కాలేజీకి భౌతికకాయం అప్పగింత
- బాధలున్నోళ్లకు నేనున్నానంటూ అండగా నిలిచారు..
- జోహార్లర్పించిన ఐద్వా జాతీయ నేత ఎస్. పుణ్యవతి
- సీపీఐ (ఎం) నేతల ఘన నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సీనియర్ నేత, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకురాలు కల్లు సుగుణమ్మ (84) ఇక లేరు. వయోభారం, అనారోగ్య కారణాలతో ఆమె శనివారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. సుగుణమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కల్లు రామచంద్రారెడ్డి సతీమణి. వారికి కుమారుడు ఉత్తమ్, కూతురు రూప ఉన్నారు. ఆమె భౌతిక కాయాన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి ఆదివారం అప్పగించారు. ఉత్తమ్, రూప సమక్షంలో ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్.పుణ్యవతి, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎమ్.శ్రీనివాస్, పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకరరెడ్డి, ఐద్వా రాష్ట్ర నాయకురాలు ఇందిర తదితరులు భౌతిక కాయాన్ని వైద్య కళాశాలకు అప్పగించారు. సుగుణమ్మ మరణం ప్రజా, మహిళా ఉద్యమాలకు తీరని లోటని వారు ఈ సందర్భంగా నివాళులర్పించారు. నల్లగొండ జిల్లా మహిళా ఉద్యమంలో ఆమె కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. అంతకుముందు సుగుణమ్మ భౌతిక కాయానికి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జునరెడ్డి, ప్రమీల తదితరులు పూలమాలేసి నివాళులర్పించారు.
సమాజ మార్పు కోసం తపించారు : పుణ్యవతి
సుగుణమ్మ బతికినన్నాళ్లూ సమాజ మార్పు కోసం పరితపించారని పుణ్యవతి ఈ సందర్భంగా చెప్పారు. మహిళా సంఘం రాష్ట్ర కమిటీలో ఎక్కువకాలం కొనసాగిన గొప్ప నాయకురాలని తెలిపారు. మనం ఎన్నేండ్లు బతికామనేది ముఖ్యం కాదనీ, ఎట్లా బతికామనేది ముఖ్యమని చెప్పారు. నల్లగొండ జిల్లాలో, ముఖ్యంగా నకిరేకల్ ప్రాంతంలో అందరికీ పెద్దదిక్కుగా నేనున్నానంటూ వెన్ను తట్టేవారని గుర్తు చేసుకున్నారు. మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ప్రజల సమస్యలను పరిష్కరించటంలో ఆమె ముందుండేవారని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలు మొదలు ఇతర అన్ని సమస్యలనూ పరిష్కరించటంలో తనదైన పాత్ర పోషించారని వివరించారు. 1968లో గుంటూరు జిల్లా కాజాలో రాష్ట్ర మహిళా సంఘం తరగతులు జరిగాయని తెలిపారు. వాటికి నల్లగొండ జిల్లా నుంచి హాజరైన ముఖ్య నాయకుల్లో ఆమె ఒకరని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత పార్టీకి రకరకాల ఒడిదుడుకులు ఎదురయ్యాయి.. 1964, 1967లో కమ్యూనిస్టు ఉద్యమంలో చీలికలు వచ్చాయన్నారు. ఆ సమయంలో మహిళా ఉద్యమాన్ని మల్లు స్వరాజ్యం, మాణికొండ సూర్యావతి, సుగుణమ్మ కలిసి ముందుండి నడిపించారని వివరించారు.
అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు మహిళా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని చెప్పారు. 2002లో గుంటూరులో నిర్వహించిన ఐద్వా మహాసభలో అనారోగ్య కారణాల రీత్యా ఆమె రిలీవ్ అయ్యారని తెలిపారు. నకిరేకల్‌లో సుగుణమ్మ ఇల్లే పార్టీ ఆఫీసుగా ఉండేదని వివరించారు. మహిళా ఉద్యమాలతోపాటు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారని నివాళులర్పించారు.
తీరని లోటు : జూలకంటి
సుగుణమ్మ మరణం ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటని జూలకంటి నివాళులర్పించారు.
భర్త రామచంద్రారెడ్డితో కలిసి నల్లగొండ జిల్లాలో ఆమె పార్టీకి చేసిన సేవలు శ్లాఘనీయమని అన్నారు. ప్రజా ప్రతినిధిగా కూడా ఆమె తనదైన ముద్ర వేశారని తెలిపారు.
తన వంతు పాత్ర పోషించారు : నంద్యాల
తెలంగాణ సాయుధ పోరాటంలో సుగుణమ్మ భర్త రామచంద్రారెడ్డి కీలక పాత్ర పోషించారని నంద్యాల తెలిపారు. సుగుణమ్మ ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూనే ప్రజా ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించారని చెప్పారు. నకిరేకల్ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ప్రజలకు నిరంతరం సేవలందించారని పేర్కొంటూ నివాళులర్పించారు.