Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక లైంగికదాడి కేసు దర్యాప్తులో ఉండగానే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల కిందట ఓ బాలిక(13)ను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. ఆ రాత్రి రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకెళ్లి.. మరుసటి రోజు విడుదల చేశారు. ఈ కేసులో సదరు క్యాబ్ డ్రైవర్ సహా ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు సంబంధించి విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఓల్డ్‌సిటీ మొగల్పురా పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన ఓ బాలిక నాలుగు రోజుల కిందట సుల్తాన్‌షాహీ ప్రాంతంలో కాలినడకన వెళ్తుండగా.. ఇంటి వద్ద విడిచిపెడతానంటూ మాయమాయటలు చెప్పిన క్యాబ్ డ్రైవర్ లుక్మాన్ కిడ్నాప్ చేశాడు. ఎంత వెతికినా బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి మొగల్పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మరుసటి రోజు బాలిక తిరిగి ఇంటికి వచ్చింది. ఆమెను విచారించగా లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ తనను రంగారెడ్డి జిల్లాలోని ఏదో ఊరికి తీసుకెళ్లాడని చెప్పింది. దీంతో మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా మార్చిన పోలీసులు వెంటనే నిందితుడితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
క్యాబ్ డ్రైవర్‌కు రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ ప్రాంతంలో ఎవరు ఆశ్రయమిచ్చారనే దానిపై మొఘల్‌పురా పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడానికి కారణం ఏంటి? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? బాలికపై లైంగికదాడి జరిగిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.