Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరామ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బొగ్గును ఉత్పత్తి చేసే ప్రక్రియలో నూతన సాంకేతిక విధానాలతో పర్యావరణ హిత మైనింగ్ పద్ధతులను అవలం భించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు సింగరేణి కాలరీస్ కృషి చేస్తున్నదని డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్), ఎన్.బలరామ్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్ సింగరేణి భవన్లో నిర్వహించిన వేడుకల్లో వారు మాట్లాడుతూ సంస్థ చైౖర్మెన్, ఎండీ ఎన్.శ్రీధర్ మార్గనిర్దేశంతో గత ఏడేండ్లలో హరిత హారం కార్యక్రమంలో భాగంగా సుమారు 5.5 కోట్ల మొక్కలు నాటినట్టు వారు తెలిపారు. 'ప్రతీ అడుగు పచ్చదనం వైపే'' అనే సందేశంతో ఈ ఏడాది సింగరేణి లో పెద్ద ఎత్తున హరిత హారాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
పర్యావరణహిత బొగ్గు రవాణాలో భాగంగా సింగరేణి సంస్థ దాదాపు 600 కోట్లకు పైగా వెచ్చించి సత్తుపల్లి - కొత్తగూడెం రైల్వే లైన్ ప్రారంభంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎస్టీపీపీ లో నిర్మించతలపెట్టిన 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రంలోనూ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు కషి చేయనున్నట్టు తెలిపారు. సామాజిక బాధ్యతతో చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ చర్యలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.