Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లైంగిక వేధింపులకు పాల్పడిన నిందుతుల్ని శిక్షించాలని ఉద్యమిస్తే..పోలీసులు కుక్కల్ని ఉసిగొల్పటమేంటని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నేతలు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో పోలీసుల వైఫల్యాన్ని నిరసిస్తూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయాన్ని ముట్టడి చేపట్టాయి. ఈ సందర్భంగా పోలీసులు నిరసన కారులను నిలువరించే పేరుతో పోలీసు కుక్కలను ఉసిగోల్పారని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్ తెలిపారు. నిరసన కారులపై కుక్కలను ఉసిగొల్పే సంస్కృతి గతంలో ఎన్నడూ లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో విచ్చలవిడిగా పబ్బులకు లైసెన్సులిచ్చి అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుస్తున్నారని విమర్శించారు. తక్షణం నగరంలో ఉన్న పబ్బులను మూసివేయాలని డిమాండ్ చేశారు.నేరస్తులను పట్టుకోలేని పోలీసులు..న్యాయం కావాలని నిరసన తెలుపుతున్న విద్యార్థి, యువకులను అరెస్టుచేయటమేంటని ప్రశ్నించారు.లైంగిక దాడికి పాల్పడిన అసలైన దోషులను అరెస్టు చేయటంలో పోలీసులు విఫలమయ్యారని వారు తెలిపారు. పబ్బుల్లోకి మైనర్లను అనుమతిస్తున్నా..పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పబ్బుల్లో మాదక ద్రవ్యాలు, మద్యం విచ్చలవిడిగా యువతకు అందుబాటులో ఉంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హత్యలు, లైంగిక దాడులకు కారమవుతున్న మత్తుపానియాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వారు తెలిపారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని పబ్బులను మూసేయాలనీ, అత్యాచారానికి పాల్పడిన నిజమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జావేద్, నాయకులు కృష్ణ ,రవి,శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లెనిన్,అశోక్,నాయకులు వేణు, శేఖర్, అభిమన్యు,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.