Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య ఉద్యమాలతోనే విధానాల్లో మార్పు సాధ్యం
- పట్నం సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాల విధానాలు మారినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాద్యమవుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణ కోరుకునే వ్యక్తులు, సంస్థలు కలిసి ఐక్య ఉద్యమాలు నిర్వహించినప్పుడే ఆ మార్పు సాధ్యమవుతుందని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక - పట్నం రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవివిఎస్ఎన్ రాజు అధ్యక్షతన పర్యావరణ మార్పులు - భవిష్యత్ కర్తవ్యాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్ చైర్మెన్, అర్బన్ అండ్ రీజినల్ ప్లానర్ వేదకుమార్ మణికొండ, విశ్రాంతాచార్యులు ప్రొఫెసర్ కె.సత్యప్రసాద్, సామాజిక విశ్లేషకులు డాక్టర్ అందె సత్యం మాట్లాడారు. ప్రభుత్వాలు పైకి పర్యవరణాన్ని పరిరక్షిస్తున్నట్టు మాటలు చెబుతూ, విధానాలతో విధ్వంసం చేస్తున్నాయని వారు విమర్శించారు.
సత్యప్రసాద్ మాట్లాడుతూ గత 50 ఏండ్లుగా పర్యావరణంపై ప్రపంచ దేశాలు సదస్సులు పెట్టుకోవడం, ఒప్పందాలు చేసుకోవడం తప్ప అమలు చేయలేదని విమర్శించారు. దీంతో పర్యావరణం మరింత ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1990లో సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత ధనిక దేశాల కర్రపెత్తనం పెరిగాక పర్యావరణ పరిరక్షణ వెనుకపడిందని చెప్పారు. ప్యారీస్ ఒప్పందం, ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ నివేదిక ప్రపంచం ప్రమాదంలో పడిందని హెచ్చరించినా పట్టించుకునే స్థితిలో ఆ దేశాలు లేవన్నారు. గ్రీన్ హౌస్ కాలుష్యానికి ఒక్క అమెరికానే 60 శాతం కారణమనీ, చాలా దేశాలు ఒక శాతంలోపే ఉన్నాయని తెలిపారు. అందరూ కారణమంటూ తప్పుడు విశ్లేషణలు చేయొద్దని కోరారు. ప్యారీస్ ఒప్పందం అమలు కాకుండా అమెరికా నాయకత్వంలోని దేశాలు అడ్డుపడ్డాయని విమర్శించారు. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది చనిపోతున్నా అమానవీయ విధానాలను అవలంభిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ విదేశాల్లో సదస్సులకు పర్యావరణాన్ని పరిరక్షిస్తామంటూ మాటలు చెప్పి, దేశంలో బాక్సైట్ తవ్వకాలకంటూ అడవులను నరికేందుకు అనుమతిస్తున్నారని చెప్పారు. ఇటీవల అనకాపల్లి గ్యాస్ లీకేజీతో 300 మంది బాధితులుగా మారారని ఉదహరిస్తూ, తమదాక వస్తే తప్ప కదలమనే ఆలోచన ప్రజలు మానుకోవాలని సూచించారు.
ఐక్యంగా ఉద్యమిద్దాం....వేదకుమార్
ఒంటరిగా నిలదీసినా, ప్రశ్నించినా ప్రభుత్వాలు పట్టించుకోవని వేదకుమార్ తెలిపారు. ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ద్వారా గత 20 ఏండ్ల తమ అనుభవంతో ఇది స్పష్టమైందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోరుకుంటున్న వారంతా అంశాల వారీగా ఐక్య పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లోకి నేరుగా కార్పొరేట్లు ప్రవేశించడం, వారి గొంతుకే ప్రభుత్వ విధానాలుగా మారడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. హుస్సేన్ సాగర్‌పై 18 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేస్తే ఆరో ప్రాజెక్టు వద్ద ఆపగలిగామని తెలిపారు. హైదరాబాద్‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను 1980 నుంచి ఒక్కసారి కూడా సవరించలేదని తప్పుపట్టారు. దీన్ని పదేండ్లకు ఒకసారి సవరించాల్సి ఉందని తెలిపారు. ఆరు మాస్టర్ ప్లాన్లు ఉన్న ఏకైక నగరం హైదరాబాద్ అనీ, అయితే సరైన మాస్టర్ ప్లాన్ మాత్రం లేదని విమర్శించారు. ముందుగా అంచనా వేసిన దాని కన్నా జనాభా ఎక్కువగా పెరగడం, మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయకపోవడం, రాజకీయ పార్టీల స్వార్థ్యం కోసం పారిశ్రామికీకరణను ఇష్టానుసారంగా అనుమతించడం హైదరాబాద్‌కు కష్టాలు తెచ్చిపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ ఎజెండాగా మారాలి..... డాక్టర్ అందె సత్యం
రాజకీయ ఎజెండాగా మారిన పర్యావరణ ఉద్యమాలు విజయవంతమయ్యాయని డాక్టర్ అందె సత్యం తెలిపారు. మూడు అడవులను కనబడకుండా చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తే యురేనియం తవ్వకాలను నిలిపేసి నల్లమల అడవిని, బాక్సైట్ తవ్వకాలను నిలిపేసి మన్యం అడవులను కాపాడగలిగామని చెప్పారు. అయితే పోలవరం పేరుతో దండకారణ్యంలో లక్షల ఎకరాల అడవులను లేకుండా చేశారని చెప్పారు. మద్యనిషేధ ఉద్యమం, ఉచిత విద్యుత్ ఉద్యమం రాజకీయ ఎజెండాగా మారినందునే గత ముఖ్యమంత్రులు ఎన్టీరామారావు, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వాటిని అమలు చేశారని చెప్పారు. ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షకులుగా పైకి కనిపిస్తూ ప్రజలకు అర్థం కాకుండా లోపల విధ్వంసకర కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఐదు లక్షల మంది పారిశుధ్య కార్మికులను నియమించకుండా, స్వచ్ఛభారత్ పేరుతో ప్రచారం చేసుకు న్నారని ఉదహరించారు. పర్యవరణం దెబ్బతింటుండటంతో పేదలు బలవుతున్నారనీ, ధనవంతులు తమను తాము కాపాడుకుంటున్నారని సోదాహరణంగా వివరించారు. ఈ నేపథ్యంలో రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పట్నం ప్రధాన కార్యదర్శి డీ.జీ.నర్సింహారావు కార్యక్రమానికి స్వాగతం పలికారు.