Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్య రుసుంతో 15 వరకు అవకాశం
- 20 నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభం
- మహిళా వర్సిటీలోనూ పీజీ ప్రవేశాలు
- ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
- సీపీజీఈటీ నోటిఫికేషన్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరంలో వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూ హైదరాబాద్‌తోపాటు మహిళా విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైందని చెప్పారు. ఎనిమిది విశ్వవిద్యాలయాలు, 320 పీజీ కాలేజీల్లో 50 కోర్సులకు సంబంధించి 112 సబ్జెక్టుల్లో ప్రవేశాలుంటాయని వివరించారు. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుల సమర్పణ గడువు వచ్చేనెల నాలుగో తేదీ వరకు ఉందన్నారు. ఆలస్య రుసుం రూ.500తో వచ్చేనెల 11 వరకు, రూ.రెండు వేలతో 15వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశముందని వివరించారు. అదేనెల 20 నుంచి ఆన్లైన్లో ప్రవేశ పరీక్షలు ప్రారంభమవుతాయని అన్నారు. ఎస్సీ,ఎస్టీ, విలాంగులకు రూ.600, ఇతరులకు రూ.800, అదనంగా ప్రతి సబ్జెక్టుకూ రూ.450 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కోరారు.
పీజీలో అమ్మాయిలే అధికం
2021-22 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో 44,604 సీట్లుంటే, 22,812 మంది విద్యార్థులు ప్రవేశం పొందారని లింబాద్రి వివరించారు. ఇందులో అమ్మాయిలే అధికంగా చేరుతున్నారని చెప్పారు. 16,163 (71 శాతం) అమ్మాయిలు, 6,649 (29 శాతం) అబ్బాయిలు చేరారని అన్నారు. అమ్మాయిల ఎన్రోల్మెంట్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం గొప్ప పరిణామమని చెప్పారు. గతనెల 16న వీసీల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. సోషల్ సైన్సెస్, ఎంఏ తెలుగు, ఇంగ్లీష్‌లో చేరాలంటే ఏదైనా డిగ్రీ చదివి ఉంటే అర్హులని అన్నారు.
నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా కింద 20 శాతం సీట్లు
నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా (ఎన్ఐక్యూ) కింద దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థుల కోసం పీజీ ప్రవేశాల్లో 20 శాతం సీట్లు సూపర్‌న్యూమరరీ కింద అవకాశం కల్పిస్తున్నామని లింబాద్రి వివరించారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి ఉందనీ, ఇక్కడ విద్యావకాశాలు పెంపొందిస్తామని చెప్పారు. డిస్టెన్స్, ఆన్లైన్ విధానంలోనూ ఒక సబ్జెక్టును ఎంచుకునే అవకాశం బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో కల్పిస్తున్నామని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నామని చెప్పారు. ఓయూ ఇన్‌ఛార్జి వీసీ కె సీతారామారావు మాట్లాడుతూ విద్యార్థులకు అనుకూలంగా పీజీ ప్రవేశాల ప్రక్రియ ఉందన్నారు. సీపీజీఈటీ కన్వీనర్ ఐ పాండురంగారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి పది జిల్లాల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించిన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఓయూ వీసీ ఓఎస్డీ రెడ్యానాయక్, అడ్మిషన్ విభాగం జాయింట్ డైరెక్టర్లు గంగాధర్, ప్యాట్రిక్ తదితరులు పాల్గొన్నారు.