Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భార్యను చంపి.. ముక్కలు చేసి డ్రమ్ములో పెట్టిన భర్త
- తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి..
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
రాష్ట్ర రాజధాని జూబ్లీహిల్స్‌లో మరో దారుణం వెలుగుజూసింది. భార్యను రెండు ముక్కలుగా చేసి వాటర్ డ్రమ్ములో పెట్టాడు భర్త.. ఆపై ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా ఖిలాఘనపూర్ మండలంలోని మల్కీ జ్ఞానపల్లికి చెందిన అనిల్ కుమార్(40) రెండేండ్ల కిందట రావత్ సరోజను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సిటీకొచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గం, ఎస్పీఆర్ హిల్స్ పరిధిలోని సుభాష్‌చంద్రబోస్ నగర్లో నివాసం ఉంటున్నారు. వివాహానంతరం కొన్నాళ్ల నుంచి భార్యాభర్తలు తరచూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో సరోజ తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అక్కడ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి అనిల్‌కుమార్‌కు సర్దిచెప్పి సరోజను అతనితో పంపించారు. అయితే, ఈనెల 3న తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఫోన్ చేయగా ఎత్తకపోవడంతో ఎస్పీఆర్ హిల్స్‌లోని అల్లుడు, కుమార్తె నివసిస్తున్న ఇంటి వద్దకు వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అనిల్ కుమార్‌కు ఫోన్ చేశారు. తాను బయట ఉన్నానని చెప్పి అతను ఫోన్ పెట్టేశాడు. దీంతో సరోజ తల్లిదండ్రులు ఈనెల 4వ తేదీన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమ కుమార్తె కనిపించడం లేదని, అల్లుడిపై అనుమానం ఉన్నట్టు ఫిర్యాదు చేశారు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం (6వ తేదీ) సరోజ తల్లిదండ్రులతోపాటు వెళ్లి అనిల్‌కుమార్ ఇంటి తాళం పగులగొట్టారు. లోపల డ్రమ్ము నుంచి దుర్వాసన వస్తుండటంతో పరిశీలించగా.. సరోజ మృతదేహం కనిపించింది. ఆమెను రెండు ముక్కలుగా నరికి డ్రమ్ములో ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో నిందితున్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.