Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోడు పోరులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆదివాసీ మహిళలు
- అమ్మ లేక.. ఆకలి తీరక తల్లడిల్లుతున్న పిల్లలు
- అన్నీ తామై ఆలనా పాలన చూస్తున్న గ్రామస్తులు
- కోయపోశగూడవాసుల బాధలు వర్ణణాతీతం
నవతెలంగాణ- దండేపల్లి
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకులపేట పంచాయతీ పరిధిలోని కోయపోచగూడ గ్రామస్తులు ఏండ్లుగా పోడు భూములపై హక్కుల కోసం పోరాడుతున్నారు. తాత ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. అదే వారి జీవనాధారం. కానీ, ఉన్నట్టుండి ఇప్పుడు అటవీ అధికారులు పోడు పంటలను ట్రాక్టర్లతో ధ్వంసం చేస్తున్నారు. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి అక్రమంగా, ఆయుధాలతో ప్రవేశించారని, చెట్లు నరికి అటవీ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ అటవీ అధికారులు 12 మంది మహిళలపై అక్రమ కేసులు నమోదు చేశారు. గత బుధవారం లక్షెటిపేట్ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆ మహిళలకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో ఈ మహిళలందరూ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్నారు. తల్లీపసి పిల్లలను వేరు చేశారు. గ్రామానికి చెందిన మద్దికుంట శైలజ, రాజవ్వ, మోడితే సునిత, మొడితే పోశవ్వ, సత్తవ్వ, జైనేని లావణ్య, గుడిపెల్లి చిన్నలక్ష్మి, పెద్దలక్ష్మీ, దోసండ్ల లచ్చవ్వ, శ్యామల, గంగవ్వ, సునీత జైలుకు వెళ్లిన వారిలో ఉన్నారు. వీరిలో పలువురు చిన్నపిల్లల తల్లులు ఉన్నారు.
2003 నుంచే పోరాటం
కోయపోచగూడ గిరిజన గూడెంలో 39 కుటుంబాలు ఉన్నాయి. అందరూ నిరుపేదలే. తడకలు అల్లుతూ, కూలి పనులు చేస్తారు. అడవిని ఆనుకొని ఉండటంతో వారసత్వంగా పోడు వ్యవసాయం చేస్తున్నారు. 2003 నుంచి వీరు పోడు భూములపై హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు. ఇటీవల ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న సందర్భంలో ఇక్కడి గిరిజనులు కూడా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చారు.
వీరే కాక జిల్లాలో సుమారు 200 మంది గిరిజనులు పోడు హక్కు పట్టాలకు అర్హులుగా ఉన్నా, వీరి పేర్లు హక్కు పత్రాల జాబితాలో లేకుండా పోయాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు వీరి పేర్లను పరిగణనలోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
భూముల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం:మహేశ్వరి- గ్రామస్తురాలు
పట్టాలు ఇప్పించాలని ఎన్నో ఏండ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. మా భూములు మాకు వచ్చే వరకు వెనకడుగు వేసేది లేదు. ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడం. ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకున్న నాయకులు ఇప్పుడు మమ్ములను పట్టించుకోవడం లేదు. మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇవ్వకుండా ఇప్పుడు అటవీ అధికారులతో దాడులు చేయిస్తోంది. అరెస్టయిన మహిళల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మాకు కనీసం తినడానికి తిండి కూడా లేదు. పెద్ద సార్లు కనికరించి న్యాయం చేయాలి.
మా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నాం: మద్దికుంట రాజవ్వ
'మా తాతల కాలం నుంచి పోడు భూములను సాగు చేసు కుంటున్నం. ఇప్పుడు వేసిన పంటలను అటవీ అధికారులు ధ్వంసం చేస్తున్నారు. 2005 కంటే ముందు కూడా మాపై కేసులు నమోద య్యాయి. అటవీ అధికారులు మాపై భౌతిక దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి. వేరే ఎక్కడైనా భూమి చూపించి నా వెళ్లిపోతాం. లేదంటే మాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు.