Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదాద్రి గుట్టపైకి ఆటోలను అనుమతించాలి
- కార్మికుల పొట్టగొట్టొద్దు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- ఆటో కార్మికుల దీక్షలకు మద్దతు
- రాష్ట్రంలో బీజేపీ కుటిల ఎత్తులు చిత్తవుతాయని వ్యాఖ్య
నవతెలంగాణ - భువనగిరి
ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలే కాదు.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సోమవారం యాదగిరిగుట్టలో ఆటో కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ్మినేని మద్దతు తెలిపి మాట్లాడారు. అనంతరం కార్మికులు తమ్మినేని వీరభద్రంకు వినతిపత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
యాదాద్రిగుట్ట గుట్టపైకి ఆటోలకు ప్రవేశం కల్పించాలని 71 రోజుల నుంచి 1300మంది ఆటో డ్రైవర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీ నరసింహస్వామి ఉన్నంత వరకు ఆటో డ్రైవర్లకు గుట్టపైకి ప్రవేశం ఉంటుందని సీఎం వచ్చిన సందర్భంగా చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయన్నారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చే యాత్రికులు కూడా ఆటోలు లేకపోవడంతో అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పారు. ఆటో కార్మికుల పొట్ట కొట్టొద్దని కోరారు. తక్షణం వారి సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమస్యలపై పోరాటం చేస్తుంటే లాఠీచార్జి చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో లైంగికదాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో జరిగిన ఘటన పాశవిక చర్య అన్నారు. హోంమినిస్టర్ మనుమడి కారులో చెప్పులు, వెంట్రుకలు దొరికాయని చెబుతున్నారని, దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కొందరు నిందితులను తప్పించే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని, పేద, ధనిక తేడా చూపకుండా.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు ప్రజలకు తీవ్ర భారంగా ఉన్నాయన్నారు. ఆసరా పింఛన్లలో అవకతవకలను అరికట్టాలన్నారు. చేనేత, గీత వృత్తిదారుల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా.. రాష్ట్రంలో మతాలను, కులాల పేరుతో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు 'మసీదులను తవ్వితే శవాలు వస్తే మీయి, శివలింగాలు వస్తే మాకు ఇచ్చి పోవాలని' ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అధికారం కోసం తప్ప మరోటి కాదన్నారు. కానీ, వారి ప్రయత్నాలు, కుటిల ఎత్తులు చిత్తవుతాయని చెప్పారు.ఈ కార్యక్రమం లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మటూరి బాలరాజు, దునూరి నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, కొమ్మటి రెడ్డి చంద్రారెడ్డి, మేక అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.