Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజేఎస్ ఆత్మగౌరవ దీక్షలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ అవసరమని పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ లక్ష్యం కోసం ఉద్యమశక్తులన్ని ఏకమై పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నిరంకుశ, నియంతత్వ పాలన గద్దె దించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోమవారం టీజేఎస్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఆత్మగౌరవదీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సింగరేణి, యాదగిరిగుట్ట ఆటో జేఏసీ, భూనిర్వాసితులు, విద్యుత్ కాంట్రాక్టు, హెచ్ఎంఎస్ పాటు పలు ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపాయి.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయిందనీ, వనరులను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారని తెలిపారు. కార్పొరేట్లకు కట్టబెడుతుంటే ప్రజలకు బతుకుదెరువు కరువైందని చెప్పారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం గతంలో జేఏసీగా ఐక్యత కనబరిచిన వారంతా తిరిగి కోరుకున్న తెలంగాణ కోసం అదే ఐక్యత చూపాలని కోరారు. మళ్లీ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యవర్గ సభ్యులు జె.వి.చలపతిరావు మాట్లాడుతూ తెలంగాణ ఆకాంక్షల సాధనకు మరో పోరాటం అవసరమని తెలిపారు. కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్థన్ మాట్లాడుతూ అందరి త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఇప్పటికీ ఒక్క ఉద్యమ ఆకాంక్ష నెరవేరలేదని తెలిపారు. పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు వి.సంధ్య మాట్లాడుతూ, ధర్నాచౌక్ వద్ద 300 మందికి మించకుండా ధర్నాలు పెట్టుకోవాలని నిబంధనలు విధంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఎవరూ ప్రశ్నించకూడదన్నట్టు పాలించడం సరికాదనీ, ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మందకష్ణ మాదిగ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కంటే కేసీఆర్ నియంతత్వంగా పాలిస్తున్నారని విమర్శించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వచ్చాక ఒక ఆధిపత్యం పోయి దాని స్థానంలో మరో ఆధిపత్యం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.