Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులందరికీ ఇవ్వాలి : వ్యవకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
- కేవీపీఎస్, వ్యకాసా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ఎదుట ధర్నా
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
దళితబంధు లబ్ది దారుల ఎంపికలో ఎమ్మెల్యేల జోక్యం ఉండొద్దని, అర్హులం దరికీ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రా ములు డిమాండ్ చేశారు. అర్హులందరికీ దళితబంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం వ్యకాసా, కేవీపీఎస్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూర్ పట్టణాల్లోని ఎమ్మెల్యేల కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆర్.వెంకట్రాములు మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 18 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాధనంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రపంచ దేశాలు, రాష్ట్రాలు తిరుగుతూ రాష్ట్ర ఖజానా మొత్తం ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు తినడానికి తిండి లేక, బతకడానికి భూమి లేక ఇబ్బందులు పడుతుంటే వృథా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాల భూమి పంపిణీ చేయాలన్నారు. ప్రతి కుటుంబానికీ 300 యూనిట్ల వరకు విద్యుత్ సరఫరా ఉచితంగా చేయాలని కోరారు. దళితులకు గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
పరిగి పట్టణంలో వ్యకాసా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్దఎత్తున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తాండూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయం ఎదుట కూడా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు మల్లేశం, డీివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుభాష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సామయ్య రాములు, లక్ష్మయ్య, లాలయ్య, నర్సింలు, ప్రశాంతి, శ్రీనివాస్, అంజయ్య, ప్రభాకర్, అనంతలక్ష్మి, దళితులు పాల్గొన్నారు.