Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ వర్గీకరణపై కేంద్రం నిర్లక్ష్యం
- వందరోజులని..ఎనిమిదేండ్లయినా పట్టించుకోని సర్కార్
- బీజేపీ నిర్లక్ష్యానికి నిరసనగా జూలై రెండున సడక్ బంద్
- మూడున బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల స్థలికి మహాసంగ్రామ యాత్ర
- అవాంఛనీయ సంఘటనలు జరిగితే బీజేపీదే బాధ్యత: విలేకర్ల సమావేశంలో మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ వర్గీకరణ విషయంలో మాట తప్పిన బీజేపీతో ఇక తాడోపేడో తేల్చుకుంటామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో మందకృష్ణ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లయినా వర్గీకరణ ఎందుకు చేయలేదో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనదయాళ్ అంత్యోదయ స్ఫూర్తిని ప్రచారం చేసుకుని బీజేపీ బలపడిందనీ, ఇప్పుడు ఆ మూల సిద్ధాంతానికే ఆ పార్టీ తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. విజ్ఞప్తులతో కదిలిక రాని సర్కారును ఉద్యమంతో నిద్ర లేపుతామని హెచ్చరించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై రెండున హైదరాబాద్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో అదే రోజు సడక్ బంద్‌ను నిర్వహిస్తామని చెప్పారు. జాతీయ రహదారులన్నింటినీ దిగ్భందిస్తామని హెచ్చరించారు. మూడో తేదీన మాదిగల మహాసంగ్రామ యాత్ర నిర్వహించను న్నట్టు ప్రకటిం చారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలోని సదాశివన్ కమిషన్ రిపోర్టు, ఆంధ్ర, తెలంగాణలో ఉషామెహ్రా కమిషన్ రిపోర్టును అమలు చేయాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ అనుకూల పార్టీలు, ప్రజా సంఘాలు ఎమ్ఆర్పీఎస్ పోరాటాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.
బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాటం నిజమైందేనా?
బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేస్తున్న పోరాటం నిజమైందే అయితే..ఎంఆర్పీఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెల్పాలని మందకృష్ణ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే వడ్ల కొనుగోలు విషయంలో సడక్ బంద్ చేసినప్పుడు..ఎనిమిదేండ్లుగా మాదిగ జాతిని వంచించిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సడక్ బంద్‌కు పిలుపునివ్వటం న్యాయమైందేనని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు సృష్టించొద్దని కోరారు. వర్గీకరణ సాధించేందుకు జరగుతున్న పోరాటంలో ఎలాంటి ఆటంకాలనైనా అధిగమిస్తామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటోందనీ, మెజార్టీగా ఉన్న మాదిగలను విస్మరించి ఎలా అధికారంలోకి వస్తారో చెప్పాలని ప్రశ్నించారు.' హక్కులు సాధించుకునేందుకు ఉద్యమిస్తాం.. ఎవరికీ గులాంగిరి చేయబోమని' తెలిపారు.వర్గీకరణ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మెన్ రాగిడి సత్యం, ఎమ్ఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కుమ్మరి సత్యనారాయణ, వీఎస్ రాజు, ఎ లత,ఎం అరుణ్ తదితరులు పాల్గొన్నారు.