Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రప్రభుత్వం సహకరించాలి
- ఎన్నికలప్పుడే రాజకీయాలు..
- అప్పటి వరకూ అభివృద్ధిలో పోటీ పడదాం
- పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక ఆవిష్కరణ సభలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
పారిశ్రామికాభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవు తుందనీ, తమ ప్రభుత్వం అందుకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదనీ, లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని వివరించారు. 2021-22 ఆర్థిక సంవత్సర పరిశ్రామల శాఖ వార్షిక నివేదికను సోమవారంనాడిక్కడి ఓ హౌటల్లో ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐఐ, ఎఫ్ఐసీసీఐ, డీఐసీసీఐ, ఎఫ్‌టీసీసీఐ, అలీప్, కోవా, అసోచామ్ సహా పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రావతరణ నుంచి ఇప్పటి వరకు వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాల్లో సాధించిన ప్రగతిని గణాంకాల ద్వారా వివరించారు. టీఎస్ ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, ఆ విధానంతో 2021-22లో 3,938 పరిశ్రమల ద్వారా రూ.17,867 కోట్ల పెట్టుబడులను రాబట్టి, 96,863 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పనా సంస్థ (టీఎస్ఐఐసీ) ద్వారా 13 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశామనీ, 526 పరిశ్రమలకు 810 ఎకరాల భూమిని ఇచ్చి, రూ.6,123 కోట్ల పెట్టుబడులను ఆశిస్తున్నామన్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,626 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 2021-22లో ఏర్పాటైన పలు పరిశ్రమల పేర్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. చేనేతరంగానికి ప్రభుత్వం ఇస్తున్న చేయూతను వివరించారు. ఆరంగంలో వచ్చిన పెట్టుబడులను వివరించారు. కార్మికులకు అందిస్తున్న సంక్షేమ పథకాలనూ తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎమ్ఈ) ప్రధాన భూమిక పోషిస్తాయనీ, రంగాల వారీగా వాటిని విభజించి, ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్నదనీ, వారు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ కేంద్రప్రభుత్వ వైఖరే తమను కొంత ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలనీ, ఆ తర్వాత ప్రభుత్వాలు అభివృధ్ధిపైనే దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఆరు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు తాము కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే, ఇప్పటి వరకు వాటికి అనుమతులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలనీ, అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటే విమర్శలు చేయక తప్పట్లేదన్నారు. నూతన ఆవిష్కరణలు, సౌకర్యాల కల్పన, సమ్మిళిత వృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనీ, ఆ దిశగానే పరిశ్రమల ఏర్పాటు, అభివృధ్ధి జరుగుతున్నదని వివరించారు. కార్యక్రమంలో అంతకుముందు ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రికల్ వాహనాల విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పలు సంస్థలతో అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. హ్యాండ్లూం, టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్ శాఖ కార్యదర్శి జ్యోతిబుద్ధ ప్రకాష్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ డీ కృష్ణభాస్కర్, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.