Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెడికల్ బోర్డుకు మంత్రి హరీశ్ రావు ఆదేశం
- న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలని సూచన
- కరోనా కాలంలో సేవలందించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20శాతం వేయిటీజీ
- ఉన్నతాధికారులతో సమీక్షలో పలు నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 1,326 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆ శాఖ మంత్రి హరీశ్ రావులు తెలిపారు. ఈ పోస్టులు వైద్యవిద్య, ప్రజారోగ్యం, టీవీవీపీ, ఐపీఎం విభాగాల్లోనివని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో సంబంధిత ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఆయా పోస్టులను మెడికల్ బోర్డు ద్వారా భర్తీ చేయాలనీ, అందుకోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కరోనా కాలంలో సేవలందించిన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి 20 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వాలన్నారు. ఆయుష్ విభాగం పోస్టులను కూడా మెడికల్ బోర్డు ద్వారానే నింపాలని సూచించారు. టెక్నికల్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ల పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా, నిమ్స్‌లోని ఖాళీలను నిమ్స్ బోర్డు ద్వారా, మిగిలిన అన్ని ఖాళీలను మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని కోరారు. ఆయుష్ విభాగంలోని స్టాఫ్ నర్సుల పోస్టులను టీఎస్ పీఎస్సీ ద్వారా కాకుండా, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా జీవో నెంబర్ 34, 35ను సవరించాలన్నారు. స్టాఫ్ నర్సులకు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించి మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలన్నారు. ఆయుష్ డాక్టర్లను టీచింగ్ స్టాఫ్‌గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, అందులో ఏర్పడే ఖాళీలను తర్వాతి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించారు. ఆయుష్ సర్వీసు రూల్స్ లో సవరణలు చేయాలన్నారు. ప్రయివేట్ ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ సవరణలు చేయాలని మంత్రి హరీశ్ రావు వైద్యశాఖాధికారులను ఆదేశించారు.
జాతీయ ఆరోగ్య మిషన్ పథకం పరిధిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న వారు ఎంత మంది ఉన్నారు? వారు పని చేస్తున్నారు? అనే అంశాలపై పూర్తి నివేదికని ఇవ్వాలని ఎన్హెచ్ఎం. డైరెక్టర్ శ్వేతా మహంతిని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. రాబోయే రెండు , మూడు వారాల్లో విడతల వారీగా నోటిఫికేషన్ల జారీ ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ తెలిపారు. వైద్యారోగ్య శాఖలో 12,755 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఒక్క మెడికల్ బోర్డు (మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్) ద్వారానే 10,028 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనుంది. ఈ క్రమంలో తొలిదశలో భాగంగా 1326 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది.