Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రౌడీల మీద తక్షణ చర్యలు తీసుకోవాలి
- గుడిసెవాసులకు పోలీసులు భద్రత కల్పించాలి
- డీజీపీ మహేందర్‌రెడ్డికి సీపీఐ(ఎం) నేతల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్ జిల్లా జక్కలొద్ది ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలు, మహిళలపై రౌడీలు చేస్తున్న దాడులు, పోలీసుల వేధింపులను ఆపాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డిని సోమవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాముులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూకంటి రంగారెడ్డి, ఎస్ వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీశ్ కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండల పరిధిలో గల జక్కలొద్దిలో 296 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలని తెలిపారు. వాటిలో 246 ఎకరాలు అన్యాక్రాంతమైందనీ, మిగిలిన 50 ఎకరాల్లో గత నెలరోజులుగా ఇండ్లు లేని నిరుపేదలు జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున 20 మంది రౌడీలు మద్యం సేవించి కత్తులు, కర్రలు, బీరు సీసాలతో గుడిసెవాసులపై దాడులకు పాల్పడ్డారని విమర్శి ంచారు. ఈ ఘటనలో రమేష్ అనే వ్యక్తి తల పగిలిందని తెలిపారు. అతడు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. ముగ్గురు మహిళల చేతులు విరిగాయని పేర్కొన్నారు. ఒక గర్బిణీని కింద పడేసి తన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుడిసెలను ధ్వంసం చేశారనీ, ఆటోల అద్దాలను పగులగొట్టి వాటిపై ఆధారపడుతున్న పేదలకు నష్టం చేకూర్చారని తెలిపారు. గుడిసెలను ఖాళీ చేసి తక్షణమే వెళ్లిపోవాలనీ, లేదంటే ప్రాణాలు తీస్తామంటూ రౌడీ మూకలు బహిరంగంగా హెచ్చరించాయని విమర్శించారు. తమకు మామునూరు సీఐ ప్రోత్సాహం ఉందటూ రౌడీ మూకలు బహిరంగంగానే ప్రకటించాయని గుర్తు చేశారు. ఈ ఘటన జరుగుతున్నపుడు తమకు రక్షణ కావాలంటూ జిల్లా పోలీసు యంత్రాంగానికి గుడిసెవాసులు 100 నెంబర్‌కు డయల్ చేసి సహాయం అడిగితే 'మీరక్కడ ఉండడమే తప్పంటూ దబాయించారు'అని వారు తెలిపారు. ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదని పేర్కొన్నారు. మరుసటి రోజు (ఈనెల మూడున) తమ పార్టీ నాయకత్వం సంఘటన జరిగిన ప్రాంతాల్లో పర్యటించిందని వివరించారు. ఘటన పూర్వాపరాలను తెలుసు కుందని తెలిపారు. జిల్లా పోలీసు కమిషనర్‌ను స్వయంగా కలిసి వినతిపత్రం ఇచ్చారని గుర్తు చేశారు. అయినా చర్యలు తీసుకోలేదని విమర్శిం చారు. ఆ తర్వాత నుంచి పరిస్థితి చక్కబడకపోగా అక్కడి ప్రజలపై మరింత నిర్బంధం పెరిగిందని పేర్కొన్నారు. బాధితులకు రక్షణగా ఉండాల్సిన స్థానిక పోలీసులే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. జక్కలొద్దికి వెళ్లాల్సిన అన్ని దారుల్లో పోలీసు అవుట్ పోస్టులు పెట్టారని వివరించారు. కూలీనాలి చేసుకునే గుడిసె వాసుల రాకపోకలను అడ్డగిస్తున్నారని తెలిపారు. నడిచిపోతున్న వారినీ వదలట్లేదని పేర్కొన్నారు.
ఈనెల రెండున దాడి చేసిన రౌడీలు ఐదో తేదీన పోలీసు అవుట్ పోస్టుల్లో కూర్చుని వచ్చిపోయే వారిని బెదిరిస్తున్నారని వారు విమర్శించారు. ఈనెల నాలుగు, ఐదు తేదీల్లో గుడిసెవాసుల వద్దకు పోలీసులు వెళ్లి 'స్థానికులు వచ్చి మీ మీద దాడి చేస్తారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిదంటూ బెదిరించారు'అని తెలిపారు. చిరువ్యాపారులపై కేసులు పెడతామని బెదిరించారని విమర్శించారు. బెస్తం చెరువు శిఖం భూమిలో ఈనెల ఐదున రౌడీలు మహిళలను వేధిస్తుంటే 100 నెంబర్‌కు ఫోన్ చేశారని పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి సీఐ స్వయంగా వచ్చి ఆకతాయి దాడులు ఇంకా పెరుగుతాయనీ, స్థానికులు వచ్చి కొడతారనీ, గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ బెదిరించారని తెలిపారు. ఈనెల రెండున గుడిసె వాసుల మీద దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేసిన రౌడీల మీద తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గుడిసె వాసుల మీద రౌడీలను ఉసిగొల్పుతున్న స్థానిక పోలీసుల చర్యలను, పేదలమీద వారి వేధింపులను ఆపాలనీ, గుడిసె వాసులకు భద్రత కల్పించాలని కోరారు.