Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలో జరిగిన పలు కేసుల్లోనూ అనుమానాలు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ మహిళలు, యువతులు, బాలికలపై లైంగిక వేధింపులు, అఘాయిత్యాలు, దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఒక సంఘటన నుంచి మనం తేరుకోకముందే మరో సంఘటన జరుగుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. పాలకుల వైఫల్యం, పోలీసుల ఉదాశీనత, తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి తోడు ప్రపంచీకరణ నేపథ్యంలో యువతలో ప్రబలుతున్న పెడ ధోరణులు, విచ్చలవిడి సంస్కృతులు వీటికి కారణమవుతున్నాయి. ఇదే సమయంలో వివిధ బూర్జువా రాజకీయ పార్టీలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా వాటితో చలికాచుకోవటం మనం చూస్తున్నాం. తద్వారా ఆయా పార్టీలు తమ పబ్బం గడుపుకోవటం మనకు తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... మిగతా పార్టీలతో పోలిస్తే ఇలాంటి ఘటనలను వాడుకోవటంలో సిద్ధహస్తురాలైంది. ముఖ్యంగా ఘటన జరిగిన తీరు, దానికి కారణాలు, పరిష్కారాలు అనే కోణంలో ఆలోచించటం కాకుండా వాటికి మతం, కులం రంగును పులమటం ద్వారా అది అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నది. ఇటీవల చోటు చేసుకున్న లైంగిక దాడులు, కుల దురహంకార, మతోన్మాద హత్యల సందర్భాల్లో అది వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. ఇక్కడ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ఇటీవల జరిగిన రెండు ఘటనలను మనం ఉదహరించుకోవచ్చు. వాటిలో ముస్లిం యువతిని పెండ్లి చేసుకున్న నాగరాజు హత్యోదంతం. ఈ ఘటనలో చనిపోయిన నాగరాజు హిందువు. అతడిని చంపిన వ్యక్తి ముస్లిం (అమ్మాయి అన్న). దీంతో ఈ మతోన్మాద దాడిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ కుట్ర పన్నింది. దీన్ని హిందూ, ముస్లిం కొట్లాటగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. మరోవైపు తాజాగా నగరంలోని జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటనలో పాల్గొన్నది కూడా ముస్లిం మైనర్లే. ఇందులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కూడా పాల్గొన్నారనే వార్తల నేపథ్యంలో బీజేపీ మహా హుషారైంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఏకంగా మీడియాతో మాట్లాడారు. లైంగిక దాడికి ముందు కారులో జరిగిన ఘటనలతో కూడిన ఫొటోలు, వీడియోలను ఆయన బయటపెట్టారు. ఇక్కడే అసలు ట్విస్ట్ దాగుంది. పోలీసులకు దొరకని సాక్ష్యాలు రఘునందన్‌రావు వద్దకు ఎలా చేరాయో తెలియక ఆ డిపార్టుమెంటు పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇదే సమయంలో ఇదే హైదరాబాద్ బేగంబజార్‌లో జరిగిన మరో కుల దురహంకార హత్య కేసుపై బీజేపీ నోరు మెదపలేదు. మిర్యాలగూడలో ప్రణరు హత్యపై అది పెదవి విప్పలేదు. ఇలా రాష్ట్రంలో జరిగిన అనేక ఘటనలపై అది మౌనంగా ఉండటాన్నిబట్టి...ప్రతీ సందర్భంలోనూ 'నాకేంటి...' అనే రీతిలో అది వ్యవహరిస్తున్నది తప్ప నిజంగా వాటిని నియంత్రణ, నివారణకు అది పూనుకోవటం లేదని విదితమవుతున్నది. బీజేపీ వ్యవహారం ఇలా ఉండగా... మిగతా బూర్జువా పార్టీలు ఈ సమస్యలకు మూలాలు వెతక్కపోగా, రాజకీయ కోణంలోంచే వాటిని చూడటం అత్యంత ప్రమాదకరం. ఒకవేళ ఇలాంటి కేసుల్లో ఆయా పార్టీల నేతల పిల్లలు, ప్రముఖుల వారసులుంటే ఇక అవన్నీ అటకెక్కినట్టే. అలాంటి ఘటనలు ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఇటు తెలంగాణలోనూ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనటం దారుణం.
ఇక ఇప్పటి పరిస్థితికి వస్తే... రాష్ట్ర రాజధానిలో తాజాగా మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. దీని వెనుక ఒక రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడి హస్తం ఉందనీ, మరో ప్రముఖ మంత్రి మనవడి పాత్ర ఉందనే మరో పక్క ఆరోపణలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుండగా ఇందులో ఇప్పటి వరకు అలాంటి కోణాల నుంచి ఆధరాలు లభించలేదంటూ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న ఘటనలు, దేశంలో ఇతర ప్రాంతాలలో చోటు చేసుకున్న ఇలాంటి అఘాయిత్యాల కేసుల్లో కాని రాజకీయ ప్రముఖులకు ఉన్న సంబంధాల గురించి ఎప్పుడు ఆరోపణలు వచ్చినా ఆ దిశగా నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగిన ఆనవాళ్లే లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఒక మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ జరిగిన ఘటన చట్టు కూడా ఇప్పుడు రాజకీయ దూమారాలే లేస్తున్నాయి. గత నెల 28వ తేదీన జూబ్లీహిల్స్‌లోని అమ్నెషియా పబ్ నుంచి ఒక మైనర్ బాలికను ఐదుగురు (ఇందులో ఇద్దరు మైనర్లు) తీసుకెళ్లి దూర ప్రదేశంలో లైంగిక దాడి జరిపినట్టు మే 31న స్థానిక పోలీసు స్టేషన్లో బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ ఉదాంతం వెలుగు చూసింది. దీనిపై దర్యాప్తుకు దిగిన పశ్చిమ మండలం పోలీసులు ఎట్టకేలకు మూడో తేదీన గ్యాంగ్‌రేప్‌కు కారకులైన వారిలో సదాదుద్దిన్ మాలిక్ తో పాటు ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. ఇంకా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని డీసీపీ జోయెల్ డేవిస్ ప్రకటించారు. కాని మొదట నుంచి పోలీసుల దర్యాప్తు శైలిపై విమర్శలను రాజకీయ వర్గాలు సంధిస్తూనే ఉన్నాయి. జరిగిన ఘటన నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఒక రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడిని తప్పిస్తున్నారనేది ఒక ఆరోపణ కాగా మరో వైపు రాష్ట్ర మంత్రికి చెందిన మనవడి పేరు కూడా వినిస్తున్నదని మరో వైపు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
నిజానికి ఇలాంటి ఘటనలపై గతంలో కూడా అనేక ఆరోపణలు రాగా ఇంకా అనుమానాలు నివృత్తి కాని కేసులు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నటి ప్రత్యూష అనుమనాస్పద మృతిలో సైతం రాజకీయ ప్రముఖులకు చెందిన కుమారుల హస్తం పై బలమైన కారణాలు ఆ సమయంలో వినిపించాయి. ప్రియుడు సిద్ధార్ద్‌తో ప్రేమ వివాహానికి అంగీకరించరక పోవడం వల్లనే వారిద్దరూ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారని, సకాలంలో ఆసుపత్రికి చేరడం వలన సిద్దార్త్కు ప్రాణాపాయం తప్పిందని దర్యాప్తులో పోలీ సులు ఆ సమయంలో తేల్చారు. కాగా ప్రత్యూషది ఆత్మహత్య కాదని ఆమెను ఒక పథకం ప్రకారం హత్య చేశారని ఇందులో ఆ సమయంలో అధికారంలో ఉన్న ఒక మంత్రితో పాటు మరో ఇద్దరు రాజకీయ ప్రముఖుల కుమారుల హస్తం కూడా ఉందని బలమైన ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఆమెపై అత్యాచారాం జరిగిందంటు పోస్టుమార్టం చేసిన ఫోరిన్సిక్ డాక్టర్ ఒకరు అనుమానం వ్యక్తం చేయగా, మరో వైపు అప్పటి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ డాక్టర్ గాంధీ మాత్రం అలాంటిదేమీ లేదని తోసిపుచ్చారు. అయితే ఈ ఘటన జరిగి దాదాపు ఇరవై ఐదుఏ ఏండ్లు దాటినప్పటికి తన కూతురుది అనుమానాస్పద మృతేననీ, ఆమెను పథకం ప్రకారం హత్య చేశారని ప్రత్యూష కుటుంబసభ్యులు వాదిస్తున్నారు. ఇక మరో యువతి ఆయేషా మీరా హత్య కేసులో సైతం రాజకీయ ప్రముఖులకు సంబంధించిన పిల్లల హతస్తం ఉందనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయేషా హత్య కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడి మనవడి హస్తం ఉందని ఆ సమయంలో రాజకీయ దుమారం లేచింది. ఈ కేసులో ప్రత్యేక టీమ్ ల ద్వారా దర్యాప్తు సాగించారు. ప్రస్తుత నగర సీపీ సీవీ ఆనంద్ ఆ సమయంలో విజయవాడ సీపీగా ఉండి ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. చివరికి ఆయేషా హత్యకు లడ్డూసింగ్ అనే యువకుడు కారణమంటూ మొదట అరెస్టు చేసిన పోలీసులు తర్వాత అతను కాదని రావు అనే మరో యువకుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాని దాదాపు పదేండ్ల పాటు జైలులో ఉన్న అతను నిర్దోషిగా కోర్టు తేల్చడం, తిరిగి ఈ కేసు పై విచారణ జరపాలంటూ కోర్టు ఆదేశించడంతో ఈ కేసు మొదటికి వచ్చిన ట్టయ్యింది.
ఇక దేశాన్నే ఒక ఉపు ఊపిన ఉత్తర ప్రదేశ్‌లోని అత్రాస్ గ్యాంగ్ రేప్ కేసు లో సైతం రాజకీయమే పట్టు సాధించింది. అత్రాస్లో ఒక మహిళపై అక్కడి అగ్రవర్ణా లకు చెందిన వారు దారుణంగా గ్యాంగ్ రేప్ జరుపడం, తర్వాత ఆ బాధితురాలు ఎక్కడ కోర్టుకు వెళ్లి తమను ఇరికిస్తోందోననే అనుమానంతో దారుణంగా హత్య చేయడం రాజకీయంగా పెను దుమారాన్నే రేపింది. ఈ కేసులో అగ్రకులాలకు చెందిన బలమైన వర్గానికి అక్కడి సర్కారు వత్తాసు పలికిందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యంగా చివరికి బాధితురాలి శవాన్ని సైతం బంధువు లకు ఇవ్వకుడుండా రహస్యంగా అర్థరాత్రి పోలీసులు తీసుకెళ్లి దహనం చేయడం దేశాన్నే ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక కొసమెరుపు ఏమిటంటే ఈ కేసులో నిందితు డైన బీజేపి నాయకుడు ఒకరు జైలులో ఉండగా ఇటీవల జరిగిన యూపీ శాసనసభ ఎన్నికల్లో ఆ నిందితుడి భార్యకు టిక్కెట్ ఇచ్చి బీజేపి గెలిపించుకోవడం. అంతేగాక జైలులో ఉన్న సదరు నిందితుడు నిరపరాధి అనీ, త్వరలోనే జైలు నుంచి తిరిగి వస్తాడని అక్కడి బీజేపి పెద్దలు చెప్పడం చర్చనీయాంశమైంది. సమాజంలో సాగుతున్న పలు నేరాలలో కొందరు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతి నిధుల పిల్లలు రెచ్చిపోయి వ్యవహరించడం వారికి అదికారంలో ఉన్న వారి తల్లి దండ్రుల అండదండలు పుష్కళంగా లభిచడంతో వారి నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది . రాజకీయ ప్రముఖులుగా ప్రజలకు నిస్వా ర్థంగా సేవలు అందిస్తున్నామని చెప్పుకునే పలువురి నాయ కుల పిల్లలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు తుండగా వారికి వారి తల్లి దండ్రులు కట్టడి చేయడానికి బదులు అధికార బలన్ని అండగా చూపడం తో పరిస్థితుల మరింత దారుణంగా మారుతున్నాయి అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.