Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సగం సీట్లూ నిండని వైనం
- గతేడాది 44,604 సీట్లలో 22,763 భర్తీ
- ఎంకామ్‌లో 8 వేలకు 3 వేల మందే చేరిక
- విశ్వవిద్యాలయాలు, పట్టణాల్లోనే చేరేందుకు ఆసక్తి
- గ్రామీణ ప్రాంత కాలేజీలకు ఆదరణ కరువు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పీజీ కాలేజీల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. సీట్లు నిండక కోర్సులను నడపలేని పరిస్థితి నెలకొంది. దీంతో పీజీ కాలేజీల్లో విద్యార్థుల్లేక తరగతి గదులు ఖాళీగా కనిపిస్త్తున్నాయి. సగం సీట్లు సైతం నిండని పరిస్థితి ఉండడమే ఇందుకు నిదర్శనం. 2021-22 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో 44,604 సీట్లుంటే, 22,812 (51.14 శాతం) మంది విద్యార్థులే ప్రవేశం పొందారు. ఇందులో 16,163 (71 శాతం) మంది అమ్మాయిలు, 6,649 (29 శాతం) అబ్బాయిలు ఉన్నారు. అంటే పీజీ కోర్సుల్లో 21,792 (48.86 శాతం) సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంకోవైపు విశ్వవిద్యాలయాలకు చెందిన కాలేజీలు, నగరాలు, పట్టణాల్లోని కాలేజీల్లో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉన్నత విద్యావకాశాలు, ఇంగ్లీష్‌లో పట్టు పెంచుకోవడం, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో వారు ఈ విధంగా చేరుతున్నారు. ఇంకోవైపు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, బోధనా పద్ధతుల్లో వస్తున్న మార్పులు వంటి అంశాలపైనా నగరాలు, పట్టణాల్లో ఉంటే అవగాహన ఎక్కువుంటుంది. మరోవైపు చదువుతూనే ఉద్యోగాలు చేయడం, ఉద్యోగాలకు సంబంధించిన మెళకువలు నేర్చుకోవడం, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం, కోచింగ్‌లకు వెళ్లడం వంటి అదనపు అవకాశాలుంటాయి. ఈ కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో అక్కడ ఉండే కాలేజీలు దివాళా తీస్తున్నాయి. వాటిని మూసుకోలేక, విద్యార్థులు చేరక కాలేజీ యాజమాన్యాలు సతమతమవుతున్నాయి.
తక్కువ మందితో కోర్సులను నడపలేని పరిస్థితి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో విద్యాహబ్‌కు ప్రసిద్ధి. ఆ ప్రాంగణంలోనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉన్నది. అయితే 2021-22 విద్యాసంవత్సరంలో ఎంఎస్సీ కెమిస్ట్రీ సబ్జెక్టులో ఆ కాలేజీలో ఐదుగురు అమ్మాయిలు చేరారు. దీంతో అక్కడ ఆ కోర్సును నడపలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులతో ఉన్నత విద్యాశాఖ, విశ్వవిద్యాలయ అధికారులు సంప్రదించి ఇతర కాలేజీల్లో చేర్పించేందుకు ప్రయత్నించారు. అందులో నలుగురు విద్యార్థినిలు సరే అన్నారు. కానీ ఒక విద్యార్థిని మాత్రం ఇక్కడ కాకపోతే చదువు మానుకోవాల్సి వస్తుందని చెప్పడం అధికారులను ఆలోచింపచేసింది. ఇలా తక్కువ మంది విద్యార్థులు చేరితే ఆ కోర్సులను నడపలేని పరిస్థితి కాలేజీ యాజమాన్యాలకు ఉంటుంది. సైన్స్ కోర్సులైతే ఆర్థికంగా భారమవుతాయి. ప్రభుత్వ కాలేజీల్లో తక్కువ మంది చేరితే అధ్యాపకుల సేవలు వారి వరకే పరిమితమవుతాయి. ఇలా రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 2021-22 విద్యాసంవత్సరంలో కన్వీనర్ కోటాలో ఎనిమిది వేల సీట్లుంటే మూడు వేల మంది విద్యార్థులే చేరారు. అంటే ఐదు వేల సీట్లు మిగిలాయి. ఇలా చాలా కోర్సుల్లో ఏటా సీట్లు మిగులుతున్నాయి. ఇది ఆందోళనకరంగా ఉన్నది.
ప్రవేశాలు పెంచేందుకు చర్యలు : లింబాద్రి
పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. డిగ్రీతోపాటు ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ కోర్సులు చదివిన విద్యార్థులు సంప్రదాయ పీజీ కోర్సులవైపు వచ్చేందుకు గతనెల 16న వీసీల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. సోషల్ సైన్సెస్‌తోపాటు ఎంఏ తెలుగు, ఇంగ్లీష్‌లో చేరాలంటే ఏదైనా డిగ్రీ చదివిన విద్యార్థులు అర్హులని చెప్పారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షించేందుకు నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాను ప్రవేశపెట్టామని వివరించారు.
పది మందిలోపు చేరితే వేరే కాలేజీకి మార్చాలి : పాండురంగారెడ్డి
పది మందిలోపు విద్యార్థులు చేరితే ఆ కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి విద్యార్థులను చేర్పించే విధానాన్ని ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి రూపొందించాలని సీపీజీఈటీ కన్వీనర్ ఐ పాండురంగారెడ్డి చెప్పారు. తక్కువ మంది విద్యార్థులు చేరితే తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. ఇది అటు కాలేజీలు, ఇటు విద్యార్థులకు నష్టమని వివరించారు. విశ్వవిద్యాలయాల కాలేజీల్లో ఎక్కువ మంది చేరుతున్నారనీ, అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేరడం లేదన్నారు. ఓయూ పరిధిలో 15,339 సీట్లుంటే, 9,177 మందే విద్యార్థులు చేరారని అన్నారు.