Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్పీసీ ఆధ్వర్యంలో టెన్త్ స్పాట్ కేంద్రం వద్ద నిరసన ప్రదర్శన
- త్వరలో చలో హైదరాబాద్ చేపడతామని హెచ్చరిక
నవతెలంగాణ-సిటీబ్యూరో
బదిలీలు, ఉద్యోగోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. మంగళవారం రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెయింట్ థెరీసా టెన్త్ స్పాట్ కేంద్రం వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ.. గడిచిన ఎనిమిదేండ్లుగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేకపోవడం వల్ల సబ్జెక్ట్ టీచర్స్ కొరత ఏర్పడి విద్యార్థులకు నష్టం కలుగుతుందన్నారు. ఉపాధ్యాయులూ తీవ్ర నిరాశతో ఉన్నారన్నాని చెప్పారు. వెంటనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జూన్‌లో చలో హైదరాబాద్ చేపడతామని హెచ్చరించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ.. ఒకే మేనేజేమెంట్ పరిధిలో ఉన్న హైదరాబాద్ జిల్లా ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇవ్వడానికి ఎటువంటి ఆటంకాలూ లేవన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు తగదని, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్యామ్ సుందర్, సింహాచలం, టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి రాంబాబు, డీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్, మల్లయ్య, నాయకులు శారద, నాగరాజు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.