Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుపై పూలబండ్లు పెట్టి బైటాయింపు
- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్
నవ తెలంగాణ- చేగుంట
రోడ్డు పక్కన పూలు అమ్ముకుని జీవించే మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పూల వ్యాపారులు రోడ్డుపై బైటాయించారు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగింది. గాంధీ చౌరస్తా వద్ద కొందరు గిరిజనులు ఎన్నో ఏండ్లుగా పూల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. రోడ్డుపక్క నుంచి పూల బండ్లను తొలగించాలని మంగళవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఇసుక శ్రీనివాస్ పూల వ్యాపారం చేసుకునే మహిళలను అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆగ్రహం చెందిన గిరిజన మహిళలు రోడ్డుకు అడ్డంగా పూల బండ్లు పెట్టి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. గిరిజన మహిళలను తిట్టిన ఇసుక శ్రీనివాస్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు.