Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలుడు సహా ఎనిమిది మంది అరెస్ట్
- ప్రింటింగ్ యంత్ర సామగ్రి స్వాధీనం, కారు సీజ్ : ఏఎస్పీ రోహిత్ రాజ్
నవతెలంగాణ-భద్రాచలం
దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను భద్రాద్రి జిల్లా చర్ల మండల పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ రోహిత్ రాజ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన మల్లెల వినోద్ కుమార్, కొత్తపల్లి జీవరత్నం దొంగ నోట్లు ముద్రించి గుంటూరుకు చెందిన పబ్బటి మురళీకృష్ణతో చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన చిరిగిడి నరేష్, చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన బోస్ ప్రేమ్‌కుమార్‌కు అందజేసేవారు. వీరు చర్ల తదితర ప్రాంతాల్లో ఈ దొంగనోట్లను చలామణి చేస్తున్నారు. ఆదివాసీ ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో వీరంతా ఒక ముఠాగా ఏర్పడి దొంగనోట్లను చలామణి చేస్తున్నారు. వీరంతా చర్ల, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల సరిహద్దు ఆదివాసి గ్రామాల నుంచి చర్ల సంతకు, కూలీ పనులకు వచ్చే వారిని లక్ష్యంగా నోట్లను చలామణి చేస్తున్నారు. ఇదిలా ఉండగా గుంటూరుకు చెందిన పబ్బటి మురళీకృష్ణను రెండు నెలల కిందట నెల్లూరు కావలి పోలీసులు నకిలీ కరెన్సీ నోట్ల వ్యవహారంలో అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం చర్లలో ముఠాను అరెస్టు చేశారు. మహిళ సహా ఏడుగురు వ్యక్తులను, బాలుడిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. పట్టుబడిన ఈ ఎనిమిది మంది నుంచి రూ.500 నోట్లు 551, రూ.2000 నోట్లు 90, రూ.200 నోట్లు 300 స్వాధీనపరుచుకున్నట్టు తెలిపారు.
అదేవిధంగా నోట్ల తయారీకి ఉపయోగించే సీపీయూ-1, మోనిటర్-1, కీబోర్డు-1, ఐరన్ బాక్స్, ఆకుపచ్చని సన్నని కవర్ లాంటి దారాలు, చాకులు-10, కారు(టీఎస్ 25, 4567)ను సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో చర్ల సీఐ బి.అశోక్, చర్ల ఎస్ఐ వెంకటప్పయ్య పాల్గొన్నారు.