Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెత్త తొలగింపునకు బయోమైనింగ్ యంత్రాలు
- మంత్రి గంగుల, ప్లానింగ్బోర్డ్ వైస్ చైర్మెన్ వినోద్‌కుమార్
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
గత ప్రభుత్వాలకు ముందు చేపు లేకపోవడంతో కరీంనగర్లో డంపుయార్డు గుట్టలుగా పేరుకుపోయిందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ వినోద్ కుమార్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంత్రి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ వినోద్ కుమార్, మేయర్ సునిల్‌రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ హరిశంకర్, కమిషనర్ సేవా ఇస్లావత్ 9వ డివిజన్ పరిధిలోని మానేరు వాగు సమీపంలోని డంపింగ్ యార్డును సందర్శించారు. డంపు యార్డు ప్రక్షాళన నేపథ్యంలో రూ.16.50 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో బయో మైనింగ్ ప్రక్రియ చేసే యంత్రాలను ప్రారంభించారు. అనంతరం డంపు యార్డులో పేరుకుపోయిన 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పరిశీలించారు. ఈ సంధర్బంగా మంత్రి గంగుల, వినోద్‌కుమార్ మాట్లాడారు. కరీంనగర్ నగరంలో 1980 కాలంలో నగరానికి దూరంగా ఉంచాల్సిన డంపు యార్డును నగర సమీపంలో ప్రారంభించారని తెలిపారు. గత ప్రభుత్వాలకు దూర దృష్టి లేకపోవడంతో నగరంలో ప్రతి రోజూ ఉత్పత్తి అయ్యే చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిందన్నారు. చెత్తలో ఉండే ప్లాస్టిక్, సీసం, ఇతర వ్యర్థాలతో ప్రస్తుతం డంపు యార్డు ద్వారా వాతావరణం కలుషితమై ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు. డంపుయార్డులో పేరుకు పోయిన 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను 8 నుంచి 12 మాసాల్లో తొలగించి 9 ఎకరాల స్థలాన్ని వాడుకలోకి తెస్తామన్నారు. డంపు యార్డులో ప్రస్తుతం ఒక మిషనరీని మాత్రమే బిగించామని, కొద్ది రోజుల్లోనే మరో మిషనరీ ఏర్పాటు చేసి చెత్తను పూర్తి స్థాయిలో తొలగిస్తామన్నారు. వ్యర్థాలను విడి విడిగా చేయడంతో పాటు బయో మైనింగ్ ఎరువును తయారు చేస్తారన్నారు.