Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణం పూర్తయ్యేదాకా వెంటబడాలి
- ఎట్లయినా మూడ్రోజుల్లో ట్రయల్ రన్ పూర్తి చేయండి : అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం
నవతెలంగాణ-హుస్నాబాద్
'నీళ్లు లేక కన్నీళ్లు కారుస్తున్న మెట్టప్రాంత ప్రజల గోస చూసినోళ్లం. నీళ్ల బాధలు పోవాలని కొట్లాడి తెలంగాణ దెచ్చుకున్నం. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తున్నాం.. ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం.. అన్ని ప్రాజెక్టులు అవుతున్నాయి.. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు మూలనబెట్టిండ్రని కొందరు లొల్లిజేస్తుండ్రు.. గీ లొల్లి బందుగావాలె. నిర్మాణం పూర్తయ్యేదాకా వెంటబడి పనులు చేయండి.. మూడు నాలుగు రోజుల్లో ట్రయల్ రన్ పూర్తి చేయాలె' అని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరు శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
గౌరవెల్లి రిజర్వాయర్ పనుల పురగోతిని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. త్వరగా రిజర్వాయర్ పనులు పూర్తి చేసి హుస్నాబాద్ రైతుల ఆకాంక్ష తీర్చాలని కోరారు. రిజర్వాయర్ పాత, కొత్త పనులను రూ.583.277 కోట్ల అంచనాతో చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు. గౌరవెల్లి రిజర్వాయర్‌కు సంబంధించి మట్టి పని, కాంక్రీట్ పని, రివిట్మెంట్ తదితర పనులు 85 శాతం పూర్తి చేసినట్టు ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు. మిగతా 15 శాతం పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సర్జ్‌పూల్, పంప్‌హౌస్, కెనాల్స్ పనులు ఇప్పటికే పూర్తయినట్టు అధికారులు తెలిపారు. టన్నెల్ లైనింగ్ పనులు, పంపుల బిగింపు పనులు కూడా పూర్తయ్యాయన్నారు. మిగిలిన అన్ని పనులూ త్వరితగతిన పూర్తి చేసి ఈ నెల 12న రిజర్వాయర్‌లోకి నీళ్లు నింపేలా ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. మిగిలిన పనులకు అవసరమైన నిధులు సమకూర్చుతామన్నారు. గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే హుస్నాబాద్ ప్రాంతమంతా గోదావరి జలాలతో సస్యశ్యామలమవుతుందన్నారు. ఇరిగేషన్ ఈఈ రాములునాయక్, సిద్దిపేట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.