Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో కారు పార్కింగ్
- హీరోయిజం కోసం వారే సెల్ఫీ వీడియోలు
- ఒకరిని అరెస్టు చేయడంతో బయటపెట్టిన వీడియోలు
- ఆరుగురు నిందితుల అరెస్ట్
- 20 ఏండ్లు లేదా జీవితఖైదుకు అవకాశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒకరు మేజర్ కాగా, ఐదుగురు మైనర్లున్నారు. మంగళవారం నగర పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. 'మే 28న బెంగళూరులో ఉన్న ఉస్మాన్ అలీఖాన్ పార్టీ చేసుకుందామని హైదరాబాద్‌లోని ఫ్రెండ్స్‌తో మాట్లాడాడు. అక్కడి నుంచి అమ్నీషియా పబ్‌ను బుక్ చేశాడు. ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా పార్టీకి 150 మందిని కూడగట్టారు. పార్టీకి ఒక్కొక్కరు టికెట్‌కు రూ.1200 చెల్లించాల్సి రావడంతో బేరం చేసి రూ.900 చెల్లించారు. 28న పార్టీ కోసం పబ్‌ను బుక్ చేశారు. అందుకు 25వ తేదీ రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించారు. లైంగికదాడి బాధితురాలు రూ.1300 చెల్లించింది. 28న మధ్యాహ్నం 1:10గంటలకు పబ్‌కు వెళ్లారు. పబ్‌లో డ్యాన్స్ చేశారు. పబ్‌లో మరో స్నేహితురాలు కలిసింది. కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు.
బాలిక 3:15గంటలకి సాదుద్దీన్, మరో మైనర్‌తో మాట్లాడింది. 5:40కి పబ్‌నుంచి మరో యువతితో కలిసి బాధితురాలు (రోడ్డుపైకి) బయటకు వచ్చింది. అందులో మరో అమ్మాయి క్యాబ్‌లో వెళ్లిపోయింది. అప్పటికే బాలికను ఫాలో అవుతున్న యువకులు ఆమెతో మాటలు కలిపారు. అక్కడి నుంచి ఆమెను బెంజ్‌కారులో బేకరీకి తీసుకెళ్లారు. ఇన్నోవాలో మరో నలుగురు ఫాలో అయ్యారు. 5:44గంటలకు ఇన్నోవాలో అమ్మాయి ఎక్కింది. మార్గమధ్యలో ఓ మైనర్ కారు దిగిపోయాడు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ టెంపుల్ సమీపంలో 5:50కి కారును పార్క్ చేశారు. బలవంతంగా అమ్మాయిని ముద్దపెట్టుకున్నారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు సామూహిక లైంగిక దాడి చేశారు. రాత్రి 7:30 నిమిషాలకు పబ్ వద్ద అమ్మాయిని వదిలిపెట్టారు. బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేయడంతో అతను వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే, 31వ తేదీ వరకు దాదాపు మూడ్రోజుల వరకు అమ్మాయి ఇంట్లో విషయం చెప్పలేదు. మెడమీద గాయాలు చూసి, అనుమానంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. అమ్మాయి పూర్తి వివరాలు చెప్పకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వెస్టుజోన్ డీసీపీ డేవీస్ జోయేల్తోపాటు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.అమ్మాయిని భరోసాసెంట ర్కు తరలించారు. అదనపు డీసీపీ శిరిషాతో కౌన్సెలింగ్ ఇప్పించారు. దాంతో ధైర్యం తెచ్చుకున్న బాలిక ఒక్కరిని గుర్తించి పేరు చెప్పింది. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు సామూహిక లైంగిక దాడి జరిగిందని నిర్ధారించారు. 354,323, 367డీ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.నిందితుల కోసం ప్రత్యేక బృందాల ను రంగంలోకి దించారు. విచారణలో భాగంగా పబ్‌లో, బయటా, బేకరీతోపాటు సమీపంలోని సీసీటీవీలను పరిశీలించారు. సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత 3వ తేదీన సాదుద్దీన్‌ను, 4న సయ్యాద్ నిజాం ను, 5న మైనర్లను అరెస్టు చేశారు. యువకులు హీరోహిజం కోసం సెల్ఫీలు తీసుకున్నారని సీపీ తెలిపారు. ఈ కేసులో ఒక్కొక్కరికి 20ఏండ్ల జైలు శిక్ష లేదా జీవిత కాలం శిక్షపడుతుందన్నారు. కొన్నేండ్ల కిందట నుంచే పబ్ లైసెన్స్ పోలీస్ శాఖ చూడటం లేదని, ఎక్సైజ్ శాఖ అనుమతు లను ఇస్తోందని అన్నారు. ఇప్పటి నుంచి ప్రతి పబ్‌పై ప్రత్యేక నిఘా వేస్తామన్నారు. మైనర్లను అనుమతించొద్దని పలుసార్లు పబ్ నిర్వాహకులను హెచ్చరించినా కొందరు అనుమతిస్తున్నార ని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హౌంమినిస్టర్ మనవడు ఉన్నట్టు తమ వద్ద ఆధారాలు లేవని, ఆధారాలుంటే తమ దృష్టికి తీసుకొస్తే అరెస్టు చేస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు డీఎస్ చౌహాన్, డీసీపీలు జోయెల్ డేవిస్, శిరీష, ఏసీపీ సుదర్శన్ తదితరులున్నారు.