Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కరెంటోళ్ల సంబురాల్లో' టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ డీ ప్రభాకరరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్వరాష్ట్రంలో విద్యుత్‌రంగ స్వావలంబన సాధించామనీ, ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరం, అనివార్యమని టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. ఉద్యోగులు పనిలో క్రమశిక్షణ చూపితేనే నష్టాలను అధిగమించి విద్యుత్ సంస్థల్ని కాపాడుకోగలుగుతామని చెప్పారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్‌ఈఈఏ) ఆధ్వర్యంలో మంగళవారంనాడిక్కడి విద్యుత్‌సౌధలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు' ఆ సంఘం అధ్యక్షులు ఎన్ శివాజీ అధ్యక్షతన జరిగాయి. దీనికి సీఎమ్‌డీ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని సమైక్య పాలకులు హేళన చేశారనీ, కానీ అతి తక్కువ కాలంలోనే అన్నిరంగాలకూ 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేసే స్థాయికి ఎదిగామని చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం కారణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి మాట్లాడుతూ రూ.35వేల కోట్లతో విద్యుత్ పంపిణీ వ్యవస్థల్ని పునరుద్ధరించామన్నారు. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయనీ, తలసరి విద్యుత్ వినియోగం దేశ సగటుకంటే పెరిగిందన్నారు. కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల విద్యుత్ సంస్థలకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. క్లీన్ ఎనర్జీ సెస్‌ను రూ.50 నుంచి రూ.400 కు పెంచారని తెలిపారు. వినియోగదారులు విద్యుత్‌ను ఆదా చేయాలనీ, వారిపట్ల సంస్థ ఉద్యోగులు గౌరవంగా మెలగాలనీ సూచించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు కులమతాల చిచ్చు పెట్టేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయనీ, అలాంటి వారిపట్ల అపమ్రత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి మరో ఉద్యమం అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు గుండు శ్రీనివాస్, సంకరం బాబ్జీలకు రూ.50వేలు చొప్పున ఆర్ధిక సహకారాన్ని అందించారు. విద్యుత్ సంస్థల డైరెక్టర్లు నర్సింగరావు, టీ శ్రీనివాస్, జగత్‌రెడ్డి, సూర్యప్రకాశ్, లక్ష్మయ్య, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.