Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యంగా మరో ఘటన వెలుగులోకి..
- వేర్వేరు రోజుల్లో బాలికపై ఐదుగురు యువకుల లైంగికదాడి
- కార్ఖాన పీఎస్ పరిధిలో ఘటన, నిందితులకు రిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో దారుణాలు.. దుర్మార్గాలు పెచ్చరిల్లుతున్నాయి.. ప్రేమ పెండ్లి చేసుకున్న యువకుల హత్యల అనంతరం.. బాలికలపై లైంగిక దాడుల ఘటనలు... ఇలా రోజూ ఏదో ఒక అమానుష ఘటన జరుగుతోంది. వారం రోజులుగా లైంగిక దాడుల ఘటనలతో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఆడపిల్లను బయటకు ఎలా పంపేది.. ఎన్నాళ్లు వెన్నంటి కాపాడుకోవాలంటూ ఆందోళన చెందుతున్నారు. జూబ్లీహిల్స్లో బాలికపై లైంగికదాడి ఘటన మరువకముందే తాజాగా సికింద్రాబాద్ పరిధిలో మైనర్పై లైంగికదాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ఐదురుగు నిందితులు వేర్వేరు రోజుల్లో లైంగికదాడి చేశారు. ఈ ఘటన కార్ఖానా పీఎస్ పరిధిలో జరిగింది. బాలికతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్న ధీరజ్, రితేష్ ఫ్రెండ్షిప్ పేరుతో నమ్మించారు. వేర్వేరు రోజుల్లో లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. వారితోపాటు మరో ముగ్గురు కూడా లైంగికదాడికి ఒడిగట్టారు. భయంతో వణికిపోయిన బాలికను గమనించిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ జరిపిన పోలీసులు ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్టు గుర్తించారు. మే 30న కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు యువకులు, ఇద్దరు లాడ్జ్ నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్పై కేసు నమోదు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్పై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పరిధిలో బాలికపై లైంగికదాడి ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేశారనే ఆరోపణలపై ఐపీసీ(223) (ఎ) సెక్షన్ కింద కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. తాను వీడియో బయట పెట్టిన తర్వాతే దోషులు బయటకు వస్తున్నారని సోమవారం జరిగిన ప్రెస్మీట్లో రఘునందన్ పేర్కొన్న విషయం తెలిసిందే.