Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదీ టీఎస్ఆర్టీసీలో పరిస్థితి
ఎస్.ఎస్.ఆర్ శాస్త్రి
'తిననీకి తిండి లేదు...మీసాలకు సంపెంగ నూనె' అంటే ఇదే! టీఎస్ఆర్టీసీలో బస్సులకు టోల్ ట్యాక్సులు కట్టేందుకు పైసల్లేక అవస్థలు పడుతుంటే, 'అయ్యవార్ల' భోజనాలకు మాత్రం లక్షల్లో ఖర్చులు పెడుతున్నారు. ఆశ్చర్యపోవద్దు. ఇది నిజమే. అధికారుల నిర్లక్ష్యమో, సొమ్ముల్లేక చతికిలపడ్డారో తెలీదు కానీ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నున్న పంతంగి టోల్ గేట్ దగ్గర ఆర్టీసీ ప్రయాణీకులకు అధికారులు చుక్కలు చూపించారు. గంటల తరబడి బస్సుల్ని అక్కడ నిలిపివేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే, డ్రైవర్, కండక్టర్లు తెల్లముఖం వేసి, పై అధికారులతో పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేశారు. బస్సుల్లో నిండు గర్భిణులు, విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్లతో పాటు వివిధ పనులపై వెళ్తున్న ప్రయాణీకులు ఉన్నారు. తమకు ఆలస్యం అవుతుందని మొత్తుకున్నా, తామేం చేయలేమంటూ ఆర్టీసీ సిబ్బంది చేతులెత్తేశారు. ఇంతకీ సమస్య ఏంటంటే... ఆర్టీసీ ప్రయాణీకుల నుంచి టిక్కెట్‌తో పాటే టోల్ చార్జీలు వసూలు చేస్తుంది. ఆయా డిపోల్లో అధికారులు టోల్ రూట్లో వెళ్లే బస్సులకు 'ఫాస్ట్‌ట్యాగ్' తీసుకుంటారు. కానీ మంగళవారం అదే హైదరాబాద్- విజయవాడ రూట్లో వెళ్తున్న అనేక బస్సుల్ని పంతంగి టోల్గేట్ వద్ద అక్కడి సిబ్బంది నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులకు ఫాస్ట్‌ట్యాగ్ గడువు ముగిసిందనీ, దాన్ని రెన్యువల్ చేసుకుంటేనే ముందుకు పంపిస్తామనీ చెప్పారు. దీంతో టీఎస్ఆర్టీసీకి చెందిన అనేక బస్సులు టోల్గేట్ దగ్గర నిలిచిపోయాయి. డ్రైవర్, కండక్టర్లు తమ డిపోల అధికారులతో పలుమార్లు ఫోన్ చేసి, సమస్యను చెప్పారు. అటునుంచి ఎంత సేపటికీ రిప్లయి రాకపోవడంతో ప్రయాణీకులు విసిగిపోయి, డ్రైవర్, కండక్టర్లతో వాగ్వివాదానికి దిగారు.
ఇదేం పద్ధతి అంటూ నిలదీశారు. తామేం చేయలేమనీ, పై అధికారులు ఎలా చెప్తే, అలా చేస్తామని ఆర్టీసీ ఉద్యోగులు బేల ముఖాలేసుకొని సమాధానాలు చెప్పాల్సి వచ్చింది. చివరకు డిపో మేనేజర్లు పంతంగి టోల్గేట్ ఉద్యోగులకు ఫోన్ చేసి మాట్లాడినా, ఫాస్ట్‌ట్యాగ్ రెన్యువల్ చేసుకుంటేనే బస్సుల్ని పంపుతామనీ, లేకుంటే ప్రస్తుతానికి మ్యాన్యువల్‌గా టోల్ చార్జీలు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఓవైపు ప్రయాణీకుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం, మరోవైపు అధికారులు ఏ విషయం చెప్పకుండా నాన్చుతుండటంతో ఆర్టీసీ ఉద్యోగులు మానసికంగా సతమతమయ్యారు. ఫాస్ట్‌ట్యాగ్‌ను ఎందుకు రెన్యువల్ చేయలేదనే విషయంపై స్పందించేందుకు అధికారులు నిరాకరించారు. చివరకు కండక్టర్, డ్రైవర్లు తమ దగ్గరున్న డబ్బులతో పంతంగి టోల్గేట్ వద్ద రెండు వైపులకు సరిపడా డబ్బులు చెల్లించి బస్సుల్ని ముందుకు తీసుకెళ్లారు. దీనిపై ప్రయాణీకుల నుంచి తీవ్ర నిరసన, వ్యతిరేకత వ్యక్తమైంది. తమ నుంచి టిక్కెట్‌తో పాటే టోల్ చార్జీలు వసూలు చేసి, ఫాస్ట్‌ట్యాగ్ రెన్యువల్ చేయకుండా, గంటల తరబడి నిరీక్షించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సార్ల భోజనాలు, మర్యాదల ఖర్చు రూ.1.13లక్షలు
టోల్‌చార్జీలు చెల్లించేందుకే డబ్బుల్లేక అవస్థలు పడుతున్న ఆర్టీసీలో ఒక్కరోజు అధికారుల భోజనాలు, టిఫిన్లు, మర్యాదల ఖర్చు అక్షరాలా రూ.1,13,917 అయ్యింది. ఏప్రిల్ 23వ తేదీ బస్‌భవన్‌లో ఆర్టీసీ పాలకమండలి (బోర్డు) సమావేశం జరిగింది. దీనిలో మొత్తం 8 మంది అధికారులు పాల్గొన్నారు. వీరందరికీ రిఫ్రెష్మెంట్లు, బ్రేక్‌ఫాస్ట్, ఒక్కపూట భోజనానికి అయిన ఖర్చు అక్షరాలా రూ.89,800. ఇక ఢిల్లీ నుంచి ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ డైరెక్టర్ పరేష్‌కుమార్ గోయల్‌కు వసతి సౌకర్యం కల్పించేందుకు అయిన ఖర్చు రూ.12,390. ఆయన ప్రయాణానికి ఏర్పాటు చేసిన కారుకు అయిన ఖర్చు రూ.10,292. ఇవి కాకుండా పోస్టల్ ఛార్జీలకు రూ.1,435 ఖర్చు అయ్యాయి.
ఈ లెక్కలన్నీ సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు బస్‌భవన్ అధికారులు ఇచ్చిన సమాధానాలు. అదే దరఖాస్తులో సదరు బోర్డు మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు, మినిట్స్ కాపీని ఇవ్వమని కోరితే, వ్యాపార రహస్యాలను వెల్లడించలేమని అధికారులు సమాధానం ఇచ్చారు. ఓవైపు టోల్ చార్జీలు కూడా కట్టలేక అవస్థలు పడుతున్న ఆర్టీసీలో ఈ అదనపు ఖర్చులు ఏంటనేది కార్మికులు వేస్తున్న సూటి ప్రశ్న.