Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
- సర్పంచ్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్
నవతెలంగాణ-హన్మకొండ/కాజిపేట
రాష్ట్రంలోని పేదలకు ఇండ్ల స్థలాలు అందేవరకు వామపక్షాల భూ పోరాటాలు ఆగవని, కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా కాజిపేట మండలంలోని మడికొండ శివారులో గల 1296 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలను కలిసిన చాడ వారి పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవో 58 ప్రకారం పేదలకు నివాస స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉంటే భూమిపై లేకుంటే జైల్లో ఉండటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గుడిసెలు లేని వరంగల్‌ను చేస్తామన్న మాట కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు. ప్రభుత్వ భూములన్నీ ప్రయివేటు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు కబ్జా చేస్తుంటే వాటిని అడ్డుకుని పేదలు గూడు కోసం ఎర్రజెండా అండతో గుడిసెలు వేసుకుంటున్నారని చెప్పారు.
అనంతరం ఆయన హన్మకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ తదితర దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని, దీంతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పారు. దేశానికి ఆర్థికంగా, వాణిజ్య పరంగా తీవ్ర నష్టం కలిగించే ఈ అంశంపై ప్రధాని తక్షణమే స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలీన విదేశాంగ విధానాన్ని తీసుకొచ్చిన మన దేశంలో.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్పష్టమైన విదేశాంగ విధానాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా మతాలకతీతమైన వ్యవస్థను ఆచరించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతూ రాజ ద్రోహం కేసులు పెడుతున్నారని, ఇలాంటి దాడులను మోడీ ఇప్పటికైనా ఆపాలని అన్నారు. మరోవైపు దేశంలోని ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మడమే మోడీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, కార్పొరేట్ శక్తులకు ఎంత మేలు చేస్తే ప్రజలకు అంత నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో నిర్వహించుకునే ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో ఏ మొహం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బాలికపై లైంగిక దాడి కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే, గ్రామాల్లో సర్పంచ్‌లు అప్పులు చేసి పనులు చేశారని, వారి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, వారి పోరాటానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేదునూరి జ్యోతి, హన్మకొండ, వరంగల్ జిల్లా కార్యదర్శులు కర్రె బిక్షపతి, మేకల రవి తదితరులు ఉన్నారు.