Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయం చేయాలని బంధువుల ఆందోళన
- ఆదుకుంటామన్న మంత్రి పువ్వాడ
నవతెలంగాణ-ఖమ్మం
నీటి ట్యాంకు శుభ్రం చేసేందుకు పైకెక్కిన మున్సిపల్ కార్మికుడు బయటకు వచ్చే సమయంలో ప్రమాదవశాత్తు ట్యాంకు పై నుంచి ఉన్న పైపులైన్ ఇరుక్కుని మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం నగరంలోని నయాబజార్ స్కూల్ ప్రాంతంలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వేణుగోపాల్ నగర్‌కు చెందిన చిర్రా సందీప్(23) నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో వాటర్ మ్యాన్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం మరో ఇద్దరు కార్మికులతో కలిసి నయాబజార్ పాఠశాల పక్కనే ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును శుభ్రం చేసేందుకు పైకి ఎక్కాడు. మొత్తం శుభ్రం చేసిన అనంతరం ప్రమాదవశాత్తూ ఒక కాలు నగరానికి సరఫరా చేసే పైపులైన్లో ఇరుక్కుంది. ట్యాంకులో మోకాళ్లలోతు నీళ్లు ఉండటం.. అదే సమయంలో నీటి ప్రవాహం పెరగడంతో మరో కాలు, తలభాగం పైపులైన్లోకి జారి మధ్యలో ఇరుకున్నాడు. దీంతో కిందకు జారతాడనుకొని కొందరు వాల్వ్ తిప్పారు. కానీ, పైపులైను కింద వరకు వచ్చిన బయటకు రాలేక ఇరుక్కుపోయాడు. చాలాసేపయ్యేటప్పటికి ఊపిరాడక మృతిచెందాడు.
అగ్ని మాపక సిబ్బంది, అధికారులు, ఇతర సిబ్బంది సుమారు 5 గంటల పాటు శ్రమించారు. జేసిబిల సాయంతో పైపులు పగలగొట్టి సందీప్ మృతదేహాన్ని బయటకు తీశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సందీప్ ప్రాణం కోల్పోయాడంటూ బంధువులు ఘటన స్థలంలో ఆందోళన చేశారు. సందీప్ కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి పువ్వాడ అజరు కుమార్ వెంటనే తన వ్యక్తిగత సహాయకుడు చిరుమామిళ్ల రవికిరణ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మెన్ బచ్చు విజయకుమార్‌ను ఘటన స్థలానికి పంపించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.