Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో బియ్యాన్ని కొనబోమంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలంగాణరైతు సంఘం ఖండించింది. రాష్ట్రానికి ఇచ్చిన గడువు అయిపోయిందని చెప్పిన నేపథ్యంలో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతారని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవాలి తప్ప, రైతులను బలిపశువులను చేయొద్దని హెచ్చరించింది. ఈమేరకు బుధవారం ఇదే అంశంపై ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్రావు, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
'జూలై నెలలో 135.40 లక్షల టన్నుల బియ్యం, 275.80 లక్షల టన్నుల గోధుమలు కలిపి 411.20 లక్షల టన్నుల బఫర్ స్టాక్స్ ఉంచాలి' అని ఎఫ్సీఐ నిబంధనలు విధించిందని గుర్తు చేశారు. మేలో ఎఫ్సీఐ వద్ద 332.68 లక్షల టన్నుల బియ్యం, 303.46 లక్షల గోధుమలు మొత్తం 634.14 లక్షల టన్నులు నిల్వలు ఉన్నాయని తెలిపారు. వీటికితోడు మిల్లులు ఆడించని ధాన్యం 266.11 లక్షల టన్నులు, చిరుధాన్యాలు 4.13 లక్షల టన్నులు కూడా నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. బఫర్స్టాక్స్ను అత్యవసర పరిస్థితుల్లో సైన్యానికి, పారిశ్రామిక కార్మికులకు మాత్రమే సరఫరా చేస్తారనీ, మరో 435 లక్షల టన్నులు బియ్యం, గోధుమలు అన్ని రాష్ట్రాలకు కేంద్రం సరఫరా చేస్తుందని గుర్తు చేశారు. ఏటా రెండు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. ఈ లెక్కన 10.46 కోట్ల టన్నుల బియ్యాన్ని, గోధుమలను సేకరించే అకాశముందని గుర్తు చేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఉద్దేశాలతో బియ్యం కొనుగోలుకు అభ్యంతరాలు చెప్పకుండా రాష్ట్రంలోని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి మిల్లర్లు ఎఫ్సీఐకి పంపాల్సిన బియ్యాన్ని త్వరలో పంపడం ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే రైతులు చాలా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆందోళనలను గుర్తించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.