Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు
- ఆర్మూర్లో విద్యార్థికి కులం సర్టిఫికేట్ జారీకి చర్యలు
- నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం అధికారి కంగా గుర్తించిన 17 సంచార, ఇతర కులాలకు ప్రభుత్వ కార్యాలయాల్లో గుర్తింపు దక్కడం లేదంటూ నవతెలంగాణ రాసిన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కొత్త కులాలకు చెందిన విద్యార్థులు, అభ్యర్థులు సైతం రిజర్వేషన్ లబ్ది పొందే విధంగా ప్రభుత్వ వెబ్సైట్లలో జీఓ అప్డేట్ చేయాలని బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఆర్మూర్ ఓడ్ సామాజిక తరగతికి చెందిన జాదవ్ రాజుకు కులం సర్టిఫికేట్ జారీ అయ్యేలా చర్యలు చేపట్టారు. ఆర్ఐ అశోక్ విచారణ జరిపి సర్టిఫికేట్ జారీ చేశారు. నవతెలంగాణ కథనంతో తమ సమస్యకు పరిష్కారం లభించడంతో కొత్త కులాలకు చెందిన ప్రతినిధులు, ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుందామంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీఓ రాలేదంటూ రెవెన్యూ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో 17 సంచార, ఇతర కులాలకు చెందిన అభ్యర్థుల అప్లికేషన్లు స్వీకరించడం లేదు. జీఓ రాలేదంటూ దాటవేస్తున్నారు. ఈ వైనంపై నవతెలంగాణ మెయిన్ పేజీలో ఈ నెల 5వ తేదీన 'గుర్తించి మరిచారు' అంటూ కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి స్పందించారు. బీసీ గ్రూపు-ఏలోని 13 కులాలు, బీసీ-డిలోని నాలుగు కులాలు ప్రభుత్వ వెబ్సైట్లో నమోదుకానట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.