Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హజ్ యాత్ర ఎంతో పవిత్రమైందనీ, అక్కడికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు.వారు మరింత బాధ్యతతో వ్యవహరించడం ద్వారా ఈ యాత్రను విజయవంతం చేయాలని సూచించారు. ఈ నెల 20న హజ్‌యాత్ర ప్రారంభమవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్ అధ్యక్షత వహించారు. సమావేశంలో మంత్రులు కొప్పులతోపాటు మహమూద్ అలీ, హజ్ కమిటీ ఛైర్మెన్ సలీం, మైనార్టీ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, సీఈవో షఫీవుల్లా, ఏపీ హజ్‌కమిటీ చైర్మెన్ షేక్‌గౌస్, నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ప్రతి ఏటా ఈ యాత్ర విజయవంతంగా ముగిసేందుకు అవసరమైన నిధుల కేటాయించడంతోపాటు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. హజ్ యాత్ర ఈనెల 20 మొదలై...30వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 3,500 మంది భక్తులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలు దేరుతారని పేర్కొన్నారు. వారంతా జూలై 28 నుంచి ఆగస్టు6 తేదీల మధ్య తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని వివరించారు. మహమూద్ అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొప్ప సెక్యులర్ నాయకులనీ, ఈ క్రమంలో మైనార్టీలు ఎలాంటి అభద్రతకు లోను కాకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు. హజ్ యాత్ర విజయవంతంగా ముగిసేందుకు మరింత బాధ్యతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.