Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బి.వి.విజయలక్ష్మి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బి.వి.విజయలక్ష్మి అన్నారు. బుధవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్లో ఏఐటీయూసీ, ఐ.ఎల్.ఓ ఆధ్వర్యంలో జరిగిన పత్తి కార్మికుల రాష్ట్ర వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో పదికోట్ల మంది బాల కార్మికులు పనుల్లో ఉండటం విచారకరమన్నారు. ఐ.ఎల్.ఓ సహకారంతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లాల్లో సదస్సులు నిర్వహించి ప్రజలు, విద్యార్థులను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే పత్తి కార్మికులకు సామాజిక న్యాయం, కనీస వేతనాలు అమలు అమలు చేయాలని, వారి జీవన స్థితిగతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలకు సామాజిక భద్రత, రక్షణ కల్పించాలని కోరారు. స్త్రీ, పురుషుల మధ్య వేతనాల్లో వ్యత్యాసం లేకుండా చూడాలని, కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవన విధానం మెరుగుపరచకుండా, వారి ఆర్థిక అవసరాలను తీర్చకుండా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యం కాదని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలు కాపాడటం కోసం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, వారికి మార్కెట్ వసతి ఏర్పాటు చేయాలని కోరారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం మెరుగైన జీవన విధానం కోసం ఐ.ఎల్.ఓ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) కృషి చేస్తోందన్నారు.
వర్క్‌షాప్‌లో ఏఐటీయూసీ, ఐ.ఎల్.ఓ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఉజ్జిని రత్నాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్, ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి.చంద్రశేఖర్, ఐ,ఎఫ్.టి.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కన్వీనర్ పి.ప్రేమ్ పావని, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలకొండ కాంతయ్య, అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నండూరి కరుణకుమారి, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.ఎల్.పద్మ తదితరులు పాల్గొన్నారు.