Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేతల పిల్లలను కాపాడేందుకే అబద్ధాలు చెప్పిన సీపీ
- రాజకీయ ఒత్తిళ్లతో నిర్వీర్యం దిశగా కేసు
- పబ్‌ని మూసేయాలి..యజమానిని అరెస్టు చేయాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూబ్లీహిల్స్‌లో సామూహిక లైంగిక దాడికి గురైన బాలిక కేసును సీబీఐకి అప్పగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం, ఇతర నేతల పిల్లలను కాపాడేందుకే మీడియా సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. పబ్‌ని మూసేసి యజమానిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పబ్‌ను మూయించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో తాము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని మగ్దూం భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు. నిరసనలు తెలపకుండా ప్రతిపక్ష నాయకులను తెల్లవారుజామునే ఇండ్ల వద్దే కట్టడి చేయడం, భూ కబ్జాదారులకు వంతపాడటంలో సమర్ధులైన తెలంగాణ పోలీసులకు మైనర్‌పై సామూహిక లైంగిక దాడి ఘటనలో నిందితులను తేల్చేందుకు వారం రోజులు పట్టిందని నారాయణ ఎద్దేవా చేశారు. సీవీ ఆనంద్ మంచి మనిషి, సమర్ధుడనీ, అయితే..ఆయన రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఆయన వ్యహరిస్తున్నారని తెలిపారు. ఎంఐఎం ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ సలహాదారుని కుమారులు కేసులో భాగస్వాములైనందునే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పోలీసులతో ఇలా చేయించిందని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వ సలహాదారుడిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. పబ్‌లోకి 16-17 ఏండ్ల మైనర్లకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. నాన్ ఆల్కహాలిక్ విందులు ఉండటమేమిటని విస్మయం వ్యక్తం చేశారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం మరింత సీరియస్‌గా వ్యవహరించాలని కోరారు. హైదరాబాద్ నగరం డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిందని విమర్శించారు. కె.రామకృష్ణ మాట్లాడుతూ..బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఎనిమిదేండ్లలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వమే రూ.80 లక్షల కోట్లు అప్పులు చేసిందని గుర్తుచేశారు. ఏపీ అప్పులకు కేంద్రం పునర్విభజన చట్టంలో హామీ మేరకు ద్రవ్య లోటును పూడ్చకపోవడం, ప్రత్యేక హౌదా ఇవ్వకపోవడం, ఇతర హామీలను అమలు చేయకపోవడమే కారణమని విమర్శించారు. కీలకమైన అన్ని సమయాల్లోనూ బీజేపీని జగన్ సమర్ధిస్తున్నారని విమర్శించారు. త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీఅభ్యర్థికే వైసిపి అనుకూలంగా ఓటు వేస్తుందన్నారు. వీటిపై టిడిపి, ప్రత్యేకించి తాను ఎన్ భాగస్వామినని చెప్పుకునే జనసేనా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమ వైఖరులను స్పష్టం చేయాలని రామకృష్ణ అన్నారు.