Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల నుంచి లక్షల్లో డిపాజిట్లు సేకరణ
- ఏండ్లు గడిచినా చెల్లింపులు లేవు
- పోలీసులను ఆశ్రయించిన బాధితులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో స్నేహ సమాఖ్య పేరుతో లక్షల్లో డిపాజిట్లు సేకరించి ముఖం చాటేశారు నిర్వాహకులు. ఈ విషయం బుధవారం వెలుగు చూసింది. డిపాజిట్ల గడువు ముగిసి మూడు, నాలుగు ఏండ్లు దాటినా సమాఖ్య సభ్యులు డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు సంస్థ కార్యాలయానికి తాళం వేసి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
పట్టణంలోని ఈదులగూడలో స్నేహ పరస్పర సహాయక సహకార పొదుపు, పరపతి సంఘాల సమాఖ్య పేరుతో వెంకటేశ్వర్లు, లీలావతి, కృష్ణవేణి, జయిని బిక్షం శంకర్ తదితరులు 1994లో సంస్థను స్థాపించారు. ఈ సంస్థ పరిధిలో ప్రగతి, స్నేహ పొదుపు సంఘాల పేర్లతో వందలాది మందిని సభ్యులుగా చేర్చి నెల నెలా రూ.100 చొప్పున వసూలు చేసేవారు. వీరి నుంచి వసూలు చేసిన మొత్తాలను డిపాజిట్ల రూపంలో బాండ్లు జారీ చేయడం, కావాల్సిన వారికి రుణాలివ్వడం చేశారు. 2015 నుంచి నగదు చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నారు. ముత్తిరెడ్డికుంటకు చెందిన సుమారు వంద మంది బాధితులు తమకు రావాల్సిన సుమారు రూ.30 లక్షల కోసం కార్యాలయం చుట్టూ తిరుగు తున్నారు. నిర్వాహకులు స్పందించక పోవడంతో గత నెల 22న స్థానిక కౌన్సిలర్ పత్తిపాటి సంధ్య నవాబ్ సారథ్యంలో సంస్థ నిర్వాహకులపై ఒత్తిడి తేగా డబ్బు చెల్లిస్తామని ఒప్పుకున్నారు. గడువు ముగిసినా స్పందించకపోవడంతో బాధితులు బుధవారం సంస్థ కార్యాలయానికి తాళం వేశారు. నిర్వాహకులైన కుందూరు కృష్ణవేణి, వెంకటేశ్వర్లు, జయిని భిక్షంపై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోట్లాది రూపాయలు వసూళ్లు
స్నేహ సమాఖ్య పేరుతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసిన సంస్థ నిర్వాహకులు ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పట్టణ పరిధిలో గతంలో 36 వార్డులుండగా.. ఒక్కో వార్డులో సుమారు 30 నుంచి 40 వరకు సంఘాలు ఏర్పాటు చేశారు. రోజు వారీ వసూల్లే కాకుండా 6ఏండ్లకు రెట్టింపు సొమ్ము ఇస్తామంటూ పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్లు సేకరించినట్టు బాధితులు చెబుతున్నారు.
పిల్లల పెండ్లిండ్లు, భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న మొత్తాన్ని దోచుకెళ్లారని పలువురు బాధితులు బోరున విలపించారు. ఎలాగైనా పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.