Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో ఏడాదికి లక్ష కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో సంవత్సరానికి నాలుగు లక్షల కాటరాక్ట్ శస్త్రచికిత్సలు జరుగుతుంటే అందులో ప్రభుత్వాస్పత్రుల్లో కేవలం 25 వేలు మాత్రమే జరుగుతున్నాయని ఆయన తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఆయన తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీ) పనితీరుపై వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఆస్పత్రిలో బ్లడ్ సపరేటర్లు వాడాలనీ, డైట్ ఛార్జీలు పెంచాలనీ, చక్కటి ఆహారం రోగులకు అందించాలను కోరారు. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ చికిత్సలు, లాంగ్ బోన్ సర్జరీలు పెంచాలని సూచించారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కోరారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులు విడుదల చేశామనీ, వినియోగించుకోవాలని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు.
సి సెక్షన్లను తగ్గించడంలో వారితో పోటీ పడాలి
రాష్ట్రంలో సీ సెక్షన్ ఆపరేషన్లను 61 శాతం నుంచి 58 శాతానికి తగ్గించగలిగామని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా తెలిపారు. అయితే కర్ణాటకలో 31 శాతం, కేరళలో 38 శాతం, మహారాష్ట్రంలో 25 శాతం మాత్రమే సిజేరియన్లు జరుగుతున్నాయంటూ వారితో పోటీ పడాలని ఆదేశించారు. ఇందుకోసం అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ చికిత్సలు తక్కువగా జరుగుతున్నాయంటూ చెప్పారు. మన పట్ల విశ్వాసం లేనట్టే అని హరీశ్ రావు అన్నారు. రోగుల్లో విశ్వాసం పెంచే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆశాలు రాత్రిపూట ఉండేందుకు వీలుగా ఆసుపత్రుల్లో రెస్ట్ రూం, ఇతర అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలనీ, సూపరిండెంట్లందరూ ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
25 శాతం కొరత
ప్రభుత్వ రక్తనిధి కేంద్రాల్లో 25 శాతం కొరత ఉందని హరీశ్ రావు తెలిపారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతున్నదని చెప్పారు. రక్తం కోసం ప్రయివేటు బ్లడ్ బ్యాంకులకు వెళ్లకుండా కొరతను తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ సంచాలకురాలు శ్వేతామహంతి తదితరులు పాల్గొన్నారు.