Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షీ టీమ్స్ అధికారుల్లో అంతర్మథనం
- త్వరలోనే కార్యాచరణపై ఉన్నతాధికారుల కసరత్తు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : జూబ్లిహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక లైంగికదాడి ఘటన షీ టీమ్స్ ఉన్నతాధికారుల్లో అంతర్మథనానికి దారి తీసింది. దాదాపు నెల రోజుల్లోనే జూబ్లిహిల్స్ ఘటనతో పాటు మరో మూడు సామూహిక లైంగికదాడి ఘటనలు నగరంలో చోటు చేసుకోవటం షీ టీమ్స్ అధికారుల్లో కలవరానికి దారి తీసింది. ఒక పక్క, రాష్ట్రంలో మహిళలపై వేధింపులు మొదలుకొని వారిపై సైబర్నేరాలను అరికట్టడానికి తగు కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్న షీ టీమ్స్ అధికారులకు తాజా ఘటనలు సవాలుగా పరిణమించాయి. అనేక సందర్భాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి తో పాటు పలువురు మంత్రులు.. డీజీపీ మొదలుకొని పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు షీ టీమ్స్ ఏర్పాటుతో మహిళల భద్రతకు భరోసా ఏర్పడిందనీ, అర్ధరాత్రి వేళ కూడా మహిళలు, యువతులు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే వాతావరణం ఏర్పడిందని కొనియాడిన సందర్భాలున్నాయి.
ముఖ్యంగా, రాష్ట్ర మహిళా రక్షణ విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి లు తమ అధికారులతో కాలేజీలలో ఉమెన్ సేఫ్టీ వింగ్స్‌ను ఏర్పాటు చేసి కరోనా సమయంలో సైతం మహిళా రక్షణపై అనేక ఆన్లైన్ శిక్షణలను ఇచ్చారు. అంతేగాక, పలు కాలేజీలలో ఉమెన్ సేఫ్టీ వింగ్స్ పని చేస్తూ తమ కాలేజీలే గాక సమీప బస్తీలు, కాలేజీల్లో సైతం మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ ఏర్పడినా కల్పించుకొని రక్షణనిచ్చేలా కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. అంతేగాక, అనేక స్కూళ్లకు చెందిన బాలికలు, జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్లు, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా వేధింపులకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు యాక్షన్ ప్లాన్లను అమలు చేశారు. పట్టణ ప్రాంతాలే గాక, మండలాలు, మారు మూల ప్రాంతాలలో సైతం మహిళలపై ఎలాంటి లైంగికదాడులు జరిగినా స్పందించేలా షీ టీమ్‌లను ఏర్పాటు చేశారు. వీటన్నిటి ఏకైక లక్ష్యం మహిళలపై లైంగికదాడులు జరగకుండా చూడటమే. కానీ, తాము ఇంత చేస్తున్నా.. జూబ్లిహిల్స్ వంటి ఘటనలు చోటు చేసుకోవటం పట్ల మహిళా భద్రతా విభాగం అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటానికి తగినంతమంది సిబ్బంది, అధికారులు తమకు లేకపోవటం కూడా ఒక మైనస్ పాయింట్‌గా వారు భావిస్తున్నట్టు తెలిసింది. అయితే, పెరిగిపోతున్న పబ్బులు, క్లబ్బుల వద్ద విశృంఖలత్వం చెలరేగకుండా, చిత్తుగా తాగినవారు రెచ్చిపోయి ప్రవర్తించకుండా స్థానిక పోలీసులు ఒక నివారణ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సినవసరమున్నదని షీ టీమ్స్ అధికారులు గట్టిగా భావిస్తున్నట్టు సమాచారం. మహిళలపై వేధింపులు, లైంగికదాడులు వంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు తాము కూడా స్థానిక పోలీసులపై ఆధారపడి పని చేయాల్సి వస్తున్నదని వారు అంటున్నారు. గతంలో తమకు రక్షణ దొరకదని భావిస్తున్న ప్రాంతంలోకి రాత్రి సమయాల్లో మహిళలు కానీ, యువతులు కానీ వెళ్లకుండా ఉండటం మేలనీ, ముఖ్యంగా, పబ్బులు, క్లబ్బుల్లోకి వెళ్లే సమయాల్లో అపరిచితులను నమ్మరాదనీ, ఒంటరిగా వెళ్లరాదు తదితర అనేక జాగ్రత్తలను తాము నిర్వహించిన పలు వర్క్ షాప్‌లలో జాగ్రత్తలను సూచించటం జరిగిందని చెబుతున్నారు. అయినప్పటికీ, కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు సైతం తమ పిల్లల కదలికలపై కన్నేసి ఉంచకపోవటం వారు అర్ధరాత్రి, అపరాత్రులు బయట తిరగకుండా నివారించకపోవటం వంటి చర్యలు కూడా ఇటువంటి ఘటనలకు దోహద పడుతున్నాయని షీ టీమ్స్ అధికారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ.. జూబ్లిహిల్స్ ఘటన పోలీసుల పని తీరుపై పలు ప్రశ్నలను సంధించేలా చేసిందనే అభిప్రాయంతో కొందరు అధికారులు ఉన్నట్టు తెలిసింది. ఈ కేసు దర్యాప్తు అంశంలో తెరవెనక రాజకీయ ఒత్తిడులు కూడా పోలీసు వ్యవస్థపై గట్టిగా పని చేశాయనీ, స్వేచ్ఛనిస్తే కేసు దర్యాప్తులో ఎలాంటి అనుమానాలకూ తావివ్వకుండా ముందుకు సాగించటం పెద్ద కష్టమేమీ కాదని ఒక పోలీసు ఉన్నతాధికారి తన సన్నిహితులతో వాపోయినట్టు తెలిసింది. కాగా, ఇలాంటి నేరాలు ఇక ముందు చోటు చేసుకోకుండా షీ టీమ్స్ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సీనియర్ పోలీసు అధికారులు సీరియస్‌గా అంతర్మథనం చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఒక పటిష్టమైన కార్యచరణను రూపొందించి అమలు చేయడానికి కసరత్తును సాగిస్తున్నట్టు వినికిడి.